తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి తన విమర్శల్లో అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. రైతులకు కేసీఆర్‌తో పాటు కేంద్రంలోని బీజేపీ కూడా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్‌కు పోటీ ఎదుగుతున్న బీజేపీని కూడా ఎదుర్కొంటేనే ముందుకు వెళ్లగలమనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ ఉంది. అయితే ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌ను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసేందుకు బీజేపీ కూడా రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.
రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయే ఆయనకు టికెట్ సహా ఇతర ఇబ్బందులు లేవు. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూన శ్రీశైలం గౌడ్‌ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరచడంతో పాటు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసినట్టు అవుతుందని బీజేపీ భావించిందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్‌తోనూ తమకు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికకు ముందే సాధ్యమైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చి ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కూన శ్రీశైలం గౌడ్‌ను కమలనాథులు కాషాయ కండువా కప్పారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్‌తో పాటు రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ రాజకీయాలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:February 23, 2021, 12:29 IST