తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బండి సంజయ్ దూకుడు కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీకి దుబ్బాకలో అనూహ్యమైన విజయం సాధించిపెట్టడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఇక జీహెచ్ఎంసీలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం కూడా బండి సంజయ్ ఇమేజ్ను మరింతగా పెంచింది. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఇదే రకమైన ప్రదర్శన సాధించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇది బండి సంజయ్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని నమ్ముతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. రాబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నిక బండి సంజయ్‌కు అసలు సిసలు పరీక్షగా మారనుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కారణంగానే దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఆ పార్టీ విజయం సాధించింది. అయితే దుబ్బాకలో బీజేపీ గెలుపులో ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు పాత్ర ఎంతో ఉంది. స్థానికుడు కావడం, రెండుసార్లు అక్కడి ఓడిపోయిన సానుభూతి కలిసి రావడం రఘునందన్ రావుకు కలిసొచ్చింది. దీనికి తోడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అంతా బీజేపీకి పడటంతో.. దుబ్బాక బీజేపీ ఖాతాలో చేరింది. ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అయితే నగరంలో బీజేపీకి మొదటి నుంచి క్యాడర్ ఉంది. పార్టీ బలపడటం, క్యాడర్ బలంగా ఉండటం జీహెచ్ఎంసీలో బీజేపీకి కలిసొచ్చింది.

కేసీఆర్, జానారెడ్డి (ఫైల్ ఫోటో)
అయితే నాగార్జునసాగర్ పరిస్థితి ఈ రెండు అంశాలకు పూర్తిగా భిన్నం. నాగార్జునసాగర్‌లో బీజేపీ అంత బలంగా లేదు. దీనికి తోడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి అత్యంత బలమైన నాయకుడు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన అనేక పర్యాయాలు విజయం సాధించారు. ఆయన లేదా ఆయన కుటుంబసభ్యులు బీజేపీలోకి వెళ్లి.. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఉంటే.. అది కచ్చితంగా కమలం పార్టీకి కలిసొచ్చేదని వాదన ఉంది. కానీ జానారెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉండి.. తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను నిలుపుకోవడంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థులుగా ఉన్న నాగార్జునసాగర్‌లో ఆ రెండు పార్టీలకు బలమైన పోటీ ఇచ్చి విజయం సాధించడం బీజేపీకి అంత సులువుకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ హవా కొనసాగుతున్నా.. ఏపీకి సరిహద్దుల్లో ఉండి.. బీజేపీ అంత బలంగా లేని ఈ ప్రాంతంలో పార్టీకి మెరుగైన ఫలితాలు తీసుకురావడం బండి సంజయ్‌కు అసలు సిసలు పరీక్ష అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇక్కడ కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. తెలంగాణవ్యాప్తంగా బీజేపీ పూర్తిస్థాయిలో బలపడినట్టు భావించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి.. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనేలా దూసుకుపోతున్న బండి సంజయ్.. నాగార్జునసాగర్‌లోనూ బీజేపీకి మెరుగైన ఫలితాలు తెచ్చిపెడతారేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:January 13, 2021, 13:06 IST