తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ (TRS) అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే హరితహారం (Haritha haram) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. హరితహారాన్ని ప్రతి వర్షాకాలం ఆరంభంలో కేసీఆర్ సర్కార్ చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎండాకాలం ముగింపుకు చేరుకుని వర్షాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (BJP chief Bandi Sanjay) సీఎం కేసీఆర్ (Cm Kcr)కు లేఖ రాశారు.
సీఎం జగన్ కు బండి సంజయ్ లేఖ..
‘‘గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం ..
విషయం: పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని, పోడుభూముల్లో హరితహారం కార్యక్రమం నిలిపివేయాలని కోరుతూ..
రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పోడుభూముల సమస్యలు పరిష్కరించకుండానే ఆ భూముల్లో హరితహారం చేపట్టేందుకు ఉపక్రమించడం గిరిజనులను నయవంచనకు గురిచేయడమే. బీజేపీ తెలంగాణ శాఖ హరితహారం కార్యక్రమానికి వ్యతిరేకం కాదు. కేవలం పోడుభూముల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతున్నాం. ఇతర ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం చేపడితే బీజేపీ (BJP)కి ఎలాంటి అభ్యంతరం లేదు.
పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని దాదాపు మూడున్నర లక్షల మంది ఇప్పటికే ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్రయంత్రాగాన్ని అంతా తీసుకుని పోయి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్వయంగా ప్రకటించిన విషయం, నవంబర్ 23, 2018న మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని మీరు ప్రకటించిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుచేయదలుచుకున్నాము.
పోడుభూములు సాగుచేసుకుంటున్న వారినుంచి అక్టోబర్ నుండి ధరఖాస్తులు తీసుకోవాలని, ధరఖాస్తుల పరిశీలనకు నవంబర్‌లో సర్వే ప్రారంభించాలని, క్షేత్రస్థాయి పరిశీలన తరువాత పట్టాలు ఇవ్వాలని 2021 అక్టోబర్‌లో మీరు నిర్వహించిన హైలెవల్ మీటింగ్‌లో నిర్ణయించారు. 2019 అసెంబ్లీలో మీ ప్రకటన నుండి ఇప్పటివరకు పోడుభూముల సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లాల్లో 10 లక్షలకు పైగా పోడుభూముల పట్టాల సమస్య ఉన్నది. 2450 ఆదీవాసీ గ్రామాల్లో గిరిజనులు పోడుభూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరంలో పోడుభూములకు పట్టాలకోసం 1,83,252 ధరఖాస్తులు రాగా 1,01,177 మందికి హక్కు పత్రాలు అందాయి. అప్పటినుండి కొనసాగుతున్న పోడుభూముల సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడుభూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయి. చట్టపరంగానే గిరిజనులకు ఉన్న హక్కులను తెరసా ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం.
పోడుభూములకు పట్టాలకోసం ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగా మరోవైపు పోడుభూముల్లో హరితహారానికి ఫారెస్ట్ అధికారులు సన్నాహం చేయడం గర్హనీయం. ప్రభుత్వ చర్యల వలన గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. గతంలో ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యలవల్ల గిరిజనులకు, ఫారెస్టు అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అనేక జిల్లాల్లో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపింది.
ఆదివాసులు, గిరిజనులు అడవికి హక్కుదారులు. పోడుభూముల జోలికి ప్రభుత్వం వస్తే వారు సహించరు. ఈ విషయాన్ని మీరు గ్రహించి మీ హామీ ప్రకారం పోడుభూమి పట్టాకోసం ధరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్క గిరిజనుడు, ఆదివాసీకి పట్టా మంజూరు చేయాలని, పోడుభూముల్లో హరితహారం కార్యక్రమం చేపట్టడాన్ని విరమించుకోవాలని, పోడుభూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని బిజెపి తెలంగాణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం ఇప్పటికైనా పోడుదారులకు పట్టాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. పోడుభూముల సమస్య పరిష్కరించకుండా పోడుభూముల్లో హరితహారం చేపడితే ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోడుభూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులకు, ఆదివాసీలకు బిజెపి పూర్తి అండదండలు అందజేస్తుంది.” అని లేఖలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR