TELANGANA BABY SNAKES SPOTTED IN ANGANWADI CENTRE IN MAHABUBABAD DISTRICT SU
Telangana: అంగన్వాడీ కేంద్రంలో పాము పిల్లల కలకలం.. పాముల పుట్టను మించి..
అంగన్వాడీ కేంద్రంలో పాము పిల్లలు
ఓ అంగన్వాడీ కేంద్రం పాముల పుట్టను తలపించింది. అంగన్వాడీ కేంద్రంలోని బండల కింద దాదాపు 30 పాములు, రెండు తేళ్లు బయటపడ్డాయి. ఇంకా కొన్ని పాము పిల్లలు బయటపడుతూనే ఉన్నాయి.
ఓ అంగన్వాడీ కేంద్రంలో భారీ సంఖ్యలో పాము పిల్లలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన అంగన్వాడీ కార్యకర్త, స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఒకటో అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ కార్యకర్త శ్రీజ్యోతి.. చిన్నారులతో పాటు గర్బిణిలుకు సరుకులు పంపేందుకు భవనం తెరిచి చూడగా రెండు పాము పిల్లలు కనిపించాయి. ఆ సమయంలో శ్రీజ్యోతితో పాటు ఆయా లచ్చమ్మ అక్కడే ఉంది. దీంతో ఆందోళన చెందిన శ్రీజ్యోతి ఈ విషయాన్ని స్థానికులకు తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బండలను పక్కకు జరిపి చూడగా.. పెద్ద సంఖ్యలో పాము పిల్లలు బయటకు వచ్చాయి. అంగన్వాడీ కేంద్రంలోని బండల కింద దాదాపు 30 పాములు, రెండు తేళ్లు బయటపడ్డాయి.
అయితే బయటకు వచ్చిన పాము పిల్లలను స్థానికులు చంపేశారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాములు, తేళ్లు వస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ఘటన అని.. పాము పిల్లలు బయటకు వచ్చిన సమయంలో అక్కడ చిన్నారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. వెంటనే నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇక, అదే అంగన్వాడీ కేంద్రం నుంచి మంగళవారం కూడా మరిన్ని పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.