TELANGANA ASSEMBLY STARTS TODAY AFTER THREE DAYS GAP IN HYDERABAD VB
Assembly Session: నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆరు బిల్లులు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ
Assembly Session: సెప్టెంబర్ 24న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గులాబ్ తుఫాను దృష్ట్యా మూడు రోజులపాటు వాయిదా పడిన అసెంబ్లీ నేడు(శుక్రవారం) పునఃప్రారంభం కానుంది.నేడు హరితహారంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
మూడు రోజుల కిందట తెలంగాణ(Telangana)వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. దీని కారణంగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. నేడు అసెబ్లీ సమావేశంలో హరితహారం కార్యక్రమంపై చర్చ జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు, ప్రత్యేకాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు.
అదేవిధంగా పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై మండలిలో చర్చించనున్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు వేధింపులు, మోసాలు నిరోధించేలా రూపొందించిన కొత్త చట్టం టౌటింగ్ బిల్లు, జీఎస్టీ చట్టసవరణ బిల్లును ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన వర్సిటీ చట్టసవరణ బిల్లుపై, నల్సార్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వాయిదాపడిన అంశాలను, బిల్లులను, చర్చను తిరిగి ఎప్పుడు చేపట్టాలనేది స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి మళ్లీ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మూడవ రోజు ఎజెండా ఇలా ఉంది..
తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల చర్చనూ చేపట్ట నున్నారు. మూడవరోజు సమావేశాల్లో అసెంబ్లీలో చర్చకు వచ్చే ప్రశ్నల్లో ముఖ్యంగా.. సంగమేశ్వర మరియు బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం, gsdp లో పెరుగుదల, కస్తూర్బా బాలికా విద్యాలయాలు, గ్రామ పంచాయతీలో నిధుల మళ్లింపు, పంచాయతీరాజ్ రోడ్లపై కల్వర్టుల మరమ్మతులు, రైతుల నుంచి పత్తి సేకరణ వంటి వాటిపై చర్చ జరగనుంది. శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నల్లో.. రామప్ప ఆలయం వద్ద పర్యాటక ప్రోత్సాహకం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై సౌకర్యాలు, ఆహార శుద్ధి కేంద్రాలు, సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సొంత భవనాలు, నిరుద్యోగ యువత కొరకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
మొత్తం ఆరు బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. అవేంటంటే..
1) తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు.
2) ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్‌ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశపెడతారు.
3) తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు2021ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
4) కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లును నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
5) ది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
6) తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టనున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.