తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ముందుస్తు ఎన్నికలకు వెళ్లినట్లుగానే.. సీఎం కేసీఆర్ (CM KCR) ఈసారి కూడా ముందుస్తుకు వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కూడా ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) రావచ్చని అన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.
బండి సంజయ్ కు పోలీసుల షాక్..బీజేపీ చీఫ్ సహా 8 మందిపై కేసు నమోదు..ఎందుకంటే?
మరో 6 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని.. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. పోలింగ్ బూత్ కమిటీ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని వెల్లడించారు. బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూలస్తంభమని.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారనిచెప్పుకొచ్చారు. పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్ధమైందని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా సరల్ యాప్‌ను ఆయన లాంచ్ చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను పొందుపర్చుతున్నామని చెప్పారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.
తెలంగాణలో ఆ అసెంబ్లీ సీటు యమా హాట్ గురూ!..ఎందుకో తెలుసా?
'' కేంద్రం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, స్మార్ట్ సిటీ, హరిత హారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. సంక్షేమ పథకాలకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలి. గులాబీ నేతలు రాజకీయాల గురించి పక్కనబెట్టి.. అభివృద్ధి గురించి మాట్లాడాలి. '' అని బీఆర్ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
కాగా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం కేసీఆర్ ఇది వరకే పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రారంభిస్తున్నారు. రాజకీయంగానూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడుఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, BRS, CM KCR, Telangana