తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజి మాటలైన పుట్టుక నీది..చావు నీది కానీ బతుకంతా దేశానికి అంటూ తమిళిసై ప్రసంగం ప్రారంభించారు. 'తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్. సీఎం, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నో విజయాలు సాధించింది. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తలసరి ఆదాయం రూ.3,17115కి పెరిగింది. మూడున్నర ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తయింది. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం కోసం ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.
65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు పెట్టుబడిగా అందించాం. దేశ చరిత్రలోనే దళితబంధు తీసుకొచ్చాం. వృద్ధాప్య పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించాం. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం. గొల్లకురుమలకు 7.3 లక్షల యూనిట్ల గొర్రెలు అందించాం. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో వుందని' ప్రభుత్వం ఇచ్చిన కాపీని తమిళిసై చదివి వినిపించారు. యాదాద్రి పునర్నిర్మాణం ఒక అద్భుతం. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరం. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140 శాతం వృద్ధి. రైతుబంధు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. రైతుకు రూ. 5 లక్షల విలువైన భీమా అందిస్తున్నాం.
తెలంగాణ GSDP లో 18.2 శాతం వ్యవసాయం నుంచే వస్తుంది. విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగింది. ఒకప్పుడు కర్రెంట్ కోతలతో సతమతమైన తెలంగాణలో నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. సివిల్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల కోసం రూ. లక్ష ఆర్ధిక సాయం అందిస్తున్నాం. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తున్నాం. 2014 నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టాం. రూ3.31 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణ ఆకర్షించిందని గవర్నర్ తెలిపారు. కాగా గవర్నర్ ప్రసంగంలో కేంద్రం ప్రస్తావన లేకుండా ముగిసింది.
గవర్నర్ ప్రసంగం ముందు ప్రభుత్వం పంపిన కాపీని మాత్రమే చదువుతారా లేక తన సొంత ప్రసంగాన్ని వినిపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. కానీ గవర్నర్ కేవలం ప్రభుత్వం ఇచ్చిన కాపీని మాత్రమే చదివి వినిపించారు. కాగా తమిళిసై బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడం ఇది రెండోసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai, Kcr, Telangana, Telangana Budget, Telangana News