విద్యార్థులతో టిక్ టాక్ డాన్స్‌లు.. టీచర్లపై సస్పెన్షన్ వేటు

వీడియోలు వైరల్ కావడంతో వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బుర్హాన్ రామవరం గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు.

news18-telugu
Updated: February 20, 2020, 10:17 PM IST
విద్యార్థులతో టిక్ టాక్ డాన్స్‌లు.. టీచర్లపై సస్పెన్షన్ వేటు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్కూల్లో పాఠాలు చెప్పకుండా గానా బజానా మొదలెట్టారు. విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్స్‌లోనే డాన్స్‌లు చేస్తూ.. పాటలు పాడుతూ.. టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతున్నారు. స్కూల్‌ని టిక్ టాక్ సెంటర్‌గా మార్చేసిన టీచర్లపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి సస్పెండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు కాంట్రాక్ట్ టీచర్లు కొన్ని రోజులుగా స్కూల్లో టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. తాము చేయడమే గాక విద్యార్థులతో కూడా వీడియోలు చేయిస్తున్నారు. విద్యార్థులతో రొట్టెలు చేయించడం, విద్యార్థినులతో సినిమాల్లోని డైలాగ్‌లు, పాటలు పాడించడం వంటివి చేయించి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఆ వీడియోలు వైరల్ కావడంతో వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బుర్హాన్ రామవరం గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు. స్కూల్‌లో టిక్ టాక్ వీడియో చిత్రీకరించిన విషయం వాస్తవమేనని.. సదరు టీచర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అటు కలెక్టర్ ఎంవీ రెడ్డి సైతం వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను బలోపేతం దిశగా ప్రక్షాళన చేస్తుంటే.. ఇలా కొందరు టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి టీచర్లను విధుల నుంచి బహిష్కరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు