హోమ్ /వార్తలు /తెలంగాణ /

Attendance by Caste: చదువుల తల్లి తలదించుకునే ఘటన.. ఆ స్కూల్ లో కులాలవారీగా పిల్లలకు అటెండెన్స్..

Attendance by Caste: చదువుల తల్లి తలదించుకునే ఘటన.. ఆ స్కూల్ లో కులాలవారీగా పిల్లలకు అటెండెన్స్..

పాఠశాల నోటీస్​ బోర్డు

పాఠశాల నోటీస్​ బోర్డు

జాతీయ ఆహార భద్రత కమిషన్ సభ్యులు కరీంనగర్​లో ఓ మోడల్​ స్కూల్ ను తనిఖీ చేశారు . తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులను విచారిస్తుంటే విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి .

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas. P, News18, Karimnagar)

  అది సీఎం కేసీఆర్ (CM KCR) దత్తత గ్రామం . అక్కడే మోడల్ స్కూల్ (Model School) .. ఇంకేం విద్యార్థులకు మంచి విద్య , భోజనం అందుతుందని అందరూ భావించడం సహజం . అందరిలాగే మండల వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు కూడా అంతే సంబర పడ్డారు . కానీ వారి సంబరం ప్రిన్సిపాల్ రూపంలో మాయమైంది . మధ్యాహ్న భోజనంలో తెల్లపురుగులు , నీళ్ల చారు వల్ల విద్యార్థులు భోజనం చేయడం లేదంటూ కరీంనగర్​లోని (Karimnagar) ములుకనూర్ మాడల్ స్కూల్ (Mulkanur Model School) విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం రోడ్డు పై ఆందోళనకు దిగిన విషయానికి స్పందనగా శనివారం జాతీయ ఆహార భద్రత కమిషన్ (National Food Security Commission) సభ్యులు వోరుగంటి ఆనంద్ , భారతీదేవి , డీఈవో జనార్ధన్ రావు స్కూల్ ను తనిఖీ చేశారు . తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులను విచారిస్తుంటే విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి . ప్రతి తరగతి గదిలో రోజు ఉదయం కులాల వారీగా విద్యార్థులను నిల్చోబెట్టి అటెండెన్స్ తీసుకున్న అనంతరం కులాల వారీగా హాజరైన విద్యార్థుల సంఖ్యను బ్లాక్ బోర్డు మీద వెల్లడిస్తున్న దృశ్యం చూసి కమిషన్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు .

  తరగతి గదులలో విద్యార్థుల కుల వివక్షత విని నిర్ఘాంతపోయారు . పురుగుల అన్నం నిజమే అంటూ శనివారం కూడా మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు వచ్చాయంటూ , కూరలు రుచికరంగా ఉండడం లేదంటూ కమిషన్ సభ్యుల ముందు విద్యార్థులు వాపోయారు . పిఈటీ తమను మోకాళ్ళ మీద కొడుతుందంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు . మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండవని , తరగతి గదులలో ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదంటూ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు .

  మోడల్ స్కూల్ తనిఖీ చేయడానికి వచ్చిన తమకు నివ్వెరబోయే నిజాలు వెల్లడయ్యాని కమిషన్ సభ్యులు తెలిపారు . ఆహార భద్రత చట్టంలో ఉన్న నిబంధనలను అధికారులు పట్టించుకోలేదని, విజిలెన్స్ కమిటీ , ఫిర్యాదుల పుస్తకం , రికార్డులు ఏమీ లేవని చట్టంలోని నిబంధనలు ఎక్కడ కూడా ప్రిన్సిపాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . తరగతి గదులలో కులాల వారిగా అటెండెన్స్ తీసుకుంటున్న విషయాన్ని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఇది చాలా దారుణమైన చర్యని మండిపడ్డారు.

  కుల వివక్ష నిజమేనని..

  పురుగుల అన్నం నిజమే అంటూ , రుచికరమైన కూరలు వండడం లేదని , మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండవని విద్యార్థులు తమతో చెప్పారన్నారు . స్కూల్ పీఈటీ తమను మోకాళ్ళ మీద కొడుతుందంటూ విద్యార్థినిలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని కమీషన్ సభ్యులు వివరించారు. వంటమనుషులను మార్చాలని విద్యార్థులు కోరారన్నారు . మోడల్ స్కూల్ లో కుల వివక్షత నిజమేనని తాము ప్రత్యక్షంగా బ్లాక్ బోర్డ్ ల మీద చూసినట్టు కమీషన్ సభ్యులు తెలిపారు . ప్రిన్సిపాల్ మీద చట్టపరమైన చర్యలకు కమీషన్ సిఫారసు చేస్తున్నట్లు , మధ్యాహ్న భోజనం , పిఈటీ మీద విచారణకు ఆదేశించామని . పది రోజుల్లో చర్యలు తీసుకోవాలని పై అధికారులకు సూచించారు . లేని పక్షం లో కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు . మోడల్ స్కూల్లో కుల వివక్షను పెంచి పోషిస్తున్న ప్రిన్సిపాల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు కమిషన్ సభ్యులకు వినతి పత్రం ఇచ్చారు .

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Caste deportation, CM KCR, Karimnagar, Students

  ఉత్తమ కథలు