TEACHERS ASSETS ISSUE AFTER BACKLASH TRS CM KCR TELANGANA GOVERNMENT CANCELLED CIRCULAR ON TEACHERS ASSETS MKS
Teachers Assets : టీచర్ల ఆస్తుల వెల్లడి ఉత్తర్వులు వెనక్కి -అసలు కథ తెలుసా మీకు?
సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబిత (పాత ఫొటో)
ప్రభుత్వం టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించడంతోపాటు ఇకపై ఎటువంటి స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా అనుమతి తీసుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై కేసీఆర్ సర్కారు వెనక్కి తగ్గింది. సర్క్యులర్ రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రి సబిత ప్రకటించారు. వివరాలివే..
తెలంగాణ (Telangana)లో ప్రభుత్వ టీచర్ల(Govt Teachers)కు సంబంధించి అత్యంత వివాదాస్పదంగా మారిన ‘తప్పనిసరి ఆస్తుల వెల్లడి’ ఉత్తర్వులను కేసీఆర్ సర్కారు వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ ఈనెల 8న పాఠశాల విద్యాశాఖ (School Education Dept) సర్క్యులర్ జారీ చేయడం వివాదానికి దారితీసింది. కొందరు అక్రమార్కులను కట్టడి చేయలేని ప్రభుత్వం.. ఆ సాకుతో టీచర్లందరినీ ఇబ్బందిపెట్టడం తగదంటూ తీవ్రస్థాయిలో విమర్శలురాగా సదరు నిర్ణయంపై సర్కారు వెనక్కి తగ్గింది.
ప్రభుత్వం టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించడంతోపాటు ఇకపై ఎటువంటి స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా అనుమతి తీసుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నేతలు భగ్గుమన్నారు. ఈ నెల 8న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి రావడం, టీచర్ల వ్యతిరేకతతో వివాదంగా మారడంతో ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకుంది. సర్క్యులర్‌ను నిలిపివేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు.
నిజానికి ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలను సమర్పించడమన్నది ఎప్పటినుంచో అమల్లో ఉన్నదే. ప్రతి ఏడాది మార్చిలో టీచర్లు తమ ఆస్తుల వివరాలను ఆయా పాఠశాలల హెడ్మాస్టర్కుగానీ, ఎంఈవోకుగానీ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో కొందరు టీచర్లు పెద్ద స్థాయిలో అక్రమార్జనకు పాల్పడుతుంటం, పని మానేసి రియల్టర్లుగా కోట్లకు ఎగబాకడం లాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా నల్లగొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీపై వచ్చిన ఆరోపణలే విద్యాశాఖ తాజాగా టీచర్ల ఆస్తులపై సర్క్యులర్ జారీ చేసేందుకు కారణమయ్యాడు.
జావీద్ అలీ నిత్యం పాఠశాలకు హాజరుకాకుండా రాజకీయాలు, ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ వర్తించేలా విద్యాశాఖ ఈ నెల 8న (ఆర్సీ నంబరు 192-ఎస్టాబ్లి్‌షమెంట్-1/2022) సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. ఇకపై ఉపాధ్యాయులెవరైనా స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలనూ ప్రభుత్వానికి సమర్పించాలి. ఇల్లు, ప్లాటు, షాపు, ఖాళీ జాగా, (ఇంటిస్థలం), వ్యవసాయ భూమితోపాటు ఇతర స్థిర ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? (సర్వే నంబర్లతో సహా), ఎవరి పేరిట ఉన్నాయి? అనే పూర్తి వివరాలతోపాటు కారు, బైక్, బంగారం, ఇంట్లో వస్తులులు, పెట్టుబడులు, షేర్లు వంటి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది.
టీచర్ల ఆస్తుల ప్రకటనకు సంబంధిచి విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలతోపాటు రాజకీయ నేతలు మండిపడ్డారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీచర్లు ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడమేనని టీచర్ యూనియన్ల నేతలు ఆరోపించారు. టీచర్ల ఆస్తుల వివరాలు అడుగుతున్న కేసీఆర్.. సీఎం కాకముందు తన కుటుంబ ఆస్తులు, సీఎం అయ్యాక ఆస్తుల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించారు.
వామ్మో ఆ టీచర్ పెద్ద ఖతర్నాక్: ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీకి కారణమైన జావీద్ అలీ సర్వీస్ మొదటినుంచీ వివాదాలమయమే. దేవరకొండ పట్టణానికి చెందిన ఈయన తొలుత కానిస్టేబుల్. అయితే, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కారణంతో సస్పెండ్ చేశారు. 1996 డీఎస్సీలో ఉపాధ్యాయుడి (ఎస్జీటీ)గా ఎంపికయ్యారు. చందంపేట మండలం పెద్దమునిగల్ ప్రాథమిక పాఠశాల, తిమ్మాపూర్, కాట్రవానితండాలో విధులు నిర్వర్తించి, ప్రస్తుతం గుంటిపల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతుగా తన వర్గంవారిని కూడగట్టడం, పదవిలో ఉన్న కీలక నాయకుడికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ జావిద్ అలీ స్థానికంగా తిరుగులేని శక్తిగా ఎదిగారు.
ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్‌లోకి ప్రవేశించి భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ప్రచారం ఉంది. ఇదే అంశాన్ని విజిలెన్స్ అధికారులు సైతం నిర్ధారించారు. పాఠశాలకు గైర్హాజరవుతూ నేతల వెంట ప్రదక్షిణలు చేయడం, ఎన్నికల్లో ఒక నాయకుడిని గెలిపించేందుకు బహిరంగంగా ప్రయత్నాలు చేయడం వివాదాలకు కారణమైంది. ఆయన తీరుపై ఉపాధ్యాయ సంఘాలు పూర్తి ఆధారాలతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు నెలల క్రితమే జావీద్ అలీ వేతనంలో మూడు ఇంక్రిమెంట్లు కోత విధించారు. కొంతకాలంగా తనపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లడం, వారు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలుసుకున్న జావీద్ తన ఆస్తులను బినామీల పేరున బదలాయించారని స్థానికంగా వందతులు షికార్లు చేస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.