ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలంగాణ (Telangana)పై కూడా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో బలమైన నేతలు పార్టీ వెంట లేనప్పటికీ.. కేడర్ ఉన్నారని ఆయన నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లయినా సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన.. త్వరలోనే కరీంనగర్(Karimnagar)లో సభ పెట్టనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను టీడీపీ తలపెట్టిందని.. ఆ సభకు చంద్రబాబు కూడా వస్తారని తెలుస్తోంది.
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నాయకులు పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంతో పాటు అంబేద్కర్ మైదానాన్ని పరిశీలించారు. ఈ రెండింటిలో ఒకటి ఖరరాయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వేదికను ఖరారు చేసిన తర్వాత.. టీడీపీ నేతలు సభా ఏర్పాట్లపై దృష్టిసారించనున్నారు.
Pawan Kalyan : జనసేనకు ఒంటరి పోరే బెటరా.. ఏపీ ప్రజలు అదే కోరుతున్నారా
మొదట సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఆవిర్భావ వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ భావించింది. ఆ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని అనుకున్నారు. నగరంలో ఏపీకి చెందిన వారు చాలా మంది ఉండడంతో.. వారంతా సభకు వస్తారని భావించారు. కానీ కంటోన్మెంట్ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఆవిర్బావ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడి మైదానాలను పరిశీలించారు టీడీపీ నేతలు.
ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని నాయకులు చెప్పారు. మరి కరీంనగర్‌లో సభను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Local News, TDP, Telangana