దెబ్బ ఎక్కడ తగిలిందో.. కట్టు అక్కడే కట్టాలి... అదే విధంగా టీడీపీ తిరిగి ఏపీలో అధికారంలోకి రావాలంటే.. ఏం చేసినా ఏపీలోనే చెయ్యాలి.. అక్కడ మానేసి పార్టీ యాక్టివ్‌గా లేని తెలంగాణ (హైదరాబాద్)లో ఏం చేసినా.. అది ఏపీలో ఆ పార్టీకి కలిసిరాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ ఆవిర్భావ సభను ఎక్కడ నిర్వహించాలనే అంశంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారా?
ఈమధ్య ఏపీలో టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలవడంతో ఆ పార్టీలో తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చేసినంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇక ఏపీలో ఏమీ చెయ్యకపోయినా.. ఆటోమేటిక్‌గా గెలుపు వచ్చేస్తుంది అని భావించడంతో... తెలంగాణలో పార్టీని బలపరిచేందుకే.. పార్టీ 41వ ఆవిర్భావ సభను.. హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిసింది.
టీటీడీపీ (TTDP) అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టాక.. టీడీపీలో కొంత జోష్ పెరిగింది. ఖమ్మం (Khammam) సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం ఉంది. అందుకే ఇవాళ హైదరాబాద్‌లో సభ పెడుతున్నారు. ఐతే.. తెలంగాణలో ఏం చేసినా.. టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అక్కడ టీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఓ రేంజ్‌లో ఉంది. అందువల్ల హైదరాబాద్ సభ వల్ల కలిసొచ్చేది ఏమీ ఉండదనీ.. ఓ వర్గం వారు విశ్లేషిస్తున్నారు. ఫోకస్ మొత్తం ఏపీపై పెట్టడం బెటర్ అంటున్నారు.
ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. GHMC పరిధిలో ముందు నుంచీ టీడీపీకి కొంత పట్టుంది. ఆంధ్రా సెటిలర్లలో చాలా మంది పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. అందుకే అక్కడ ఫోకస్ పెడితే.. హైదరాబాద్‌లో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారు. నేటి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు కూడా వస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ ఇప్పటికే కొన్ని కార్యక్రమాల్ని చేపట్టింది. 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమాన్ని ఈమధ్యే ప్రారంభించారు. దీని ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతున్నారు. కొందరు నేతలు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు. సోషల్ మీడియాను మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు, కార్యకర్తలు... మళ్లీ పార్టీలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పిలుపిచ్చారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 సీట్లయినా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ్టి సభను తెలంగాణలో పెడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Hyderabad, Telangana News