వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక ట్వీట్ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. ద్విచక్ర వాహనదారులు నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తుండడంపై తెలంగాణ పోలీసు శాఖ సీరియస్ అయింది. నిబంధనలు అతిక్రమిస్తూ నంబర్లు కనిపించకుండా అతితెలివి ప్రదర్శిస్తే శిక్షకు గురవుతారంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల సాయంతో గీతదాటిన వారిని గుర్తిస్తున్నారు.
అయితే పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కకూడదని కొందరు ద్విచక్ర వాహనదారులు నంబర్ ప్లేట్లు సరిగా కనిపించకుండా చేస్తున్నారు. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కొందరు అసలు ప్లేట్ పై ఏ నంబర్ ఉందో కూడా గుర్తించలేని విధంగా డిజైన్స్ వేయిస్తున్నారు. మరికొందరు ప్లాస్టర్లు వేస్తూ నంబర్లు కనిపించకుండా చేస్తున్నారు. సోమవారం ఇలాంటి ఫొటోనే ట్వీట్ చేసిన తెలంగాణ పోలీసు శాఖ.. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేసింది.
బండి నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం శిక్షార్హనేరం. pic.twitter.com/dbJOP4gMRx
— Telangana State Police (@TelanganaCOPs) December 7, 2020
నేరాలకు పాల్పడుతున్న కొందరు సీసీ కెమెరాల కళ్లు కప్పేందుకు తమ వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. వాహనాలపై తిరిగినా ఆచూకీ గుర్తించకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీంతో కొన్ని కేసులను ఛేదించడం సవాల్‌గా మారుతోంది. దీంతో పోలీసు శాఖ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Police, Telangana, Telangana Police, Traffic police, Traffic rules