బదిలీపై వెళ్తున్న తహసీల్దార్‌కు ఊహించని షాక్.. చివరి క్షణంలో తిరగబడిన రైతులు

ప్రతీకాత్మక చిత్రం

తహసీల్దార్ నియాజుద్దీన్ రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ అతడిని బుధవారం జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు.

 • Share this:
  అతడు ఓ మండల తహసీల్దార్. రైతులకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సుపరిపాలనను అందించేందుకు కృషి చేయాలి. కానీ ఆ తహసీల్దార్ రైతుల రెవెన్యూ సమస్యలను ఆసరాగా తీసుకుని లంచాలు తీసుకునేందుకు అలవాటు పడ్డాడు. చిన్న సమస్య అయినా రూ.వేలకు వేలు లంచాలు మెక్కేశాడు. అయినా సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించేవాడు. తహసీల్దార్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అతడి చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. అలా రైతుల దగ్గరి నుంచి దాదాపు రూ.10 లక్షలకు పైగానే లంచాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి వేరే మండలానికి బదిలీ అయ్యింది. రాత్రికి రాత్రి బదిలీ అయ్యేందుకు సదరు తహసీల్దారు అన్నీ రెడీ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే అతడికి ఊహించని షాక్ తగిలింది. తమ పనులు చేయించుకునేందుకు లంచాలు ఇచ్చిన రైతులందరూ తహసీల్దార్ బదిలీ అయ్యాడన్న విషయం తెలుసుకుని తహసీల్దార్‌ను చుట్టుముట్టారు.

  మా పనులన్నా చేయండి.. లేకుంటే తీసుకున్న లంచాలన్నా వెనక్కివ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో తహసీల్దార్ తీసుకున్న లంచాలను వెనక్కి తిరిగిచ్చేస్తానంటూ ఓ తెల్లకాగితంపై హామీ రాసివ్వడంతో అతడిని తాత్కాలికంగా వదిలిపెట్టారు. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా చింతలమనెపల్లి తహసీల్దార్‌గా ఖాజా నియాజుద్దీన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పలువురు రైతుల నుంచి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు లంచాలు తీసుకున్నాడు. కానీ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరిగింది. ఈలోపే తహసీల్దార్ నియాజుద్దీన్ రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ అతడిని బుధవారం జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు.

  అయితే అప్పటికే తహసీల్దార్.. ఒక్కో రైతు నుంచి రూ.10వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేశాడు. ఆకస్మాత్తుగా బదిలీ అవ్వడం వల్ల రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయాడు. దీంతో కొత్త తహసీల్దార్ రాకముందే రాత్రి మొత్తం కార్యాలయంలోనే ఉండి పైళ్లను చక్కదిద్దారు. తెల్లారేసరికి కొత్త తహసీల్దార్ వచ్చి విధుల్లో చేరడం.. తాము లంచం ఇచ్చిన తహసీల్దార్ బదిలీపై వెళుతున్నాడన్న సమాచారం రైతులు తెలుసుకున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రైతులు.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదా పనులైనా చేయాలంటూ ఆందోళనకు దిగారు.

  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. చివరకు తహసీల్దారు రైతులకు ఎవ్వరికీ ఎంతివ్వాలో 18వ తేదీలోపు ఇస్తానంటూ తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చారు. దీంతో రైతులంతా ఆందోళనను విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
  Published by:Narsimha Badhini
  First published: