వీణా-వాణికి టెన్త్ క్లాస్ పరీక్షలు.. ssc బోర్డుకు కొత్త తలనొప్పి

4 నెలలుగా దీనిపై సమాలోచనలు చేస్తున్నా.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు మరో 27 రోజులే గడువుంది. మరో 5 రోజుల్లో హాల్ టికెట్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుంది.

news18-telugu
Updated: February 21, 2020, 6:29 PM IST
వీణా-వాణికి టెన్త్ క్లాస్ పరీక్షలు.. ssc బోర్డుకు కొత్త తలనొప్పి
వీణా-వాణి (File)
  • Share this:
అవిభక్త కవలలు వీణా-వాణి పదో తరగతి పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ssc పరీక్షల్లో వీణా-వాణీకి వేర్వేరుగా హాల్ టికెట్లు ఇవ్వాలా? లేదంటే తలలు కలిసి ఉండడంతో ఒక్కరిగాన పరిణగించాలా? అనే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 4 నెలలుగా దీనిపై సమాలోచనలు చేస్తున్నా.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు మరో 27 రోజులే గడువుంది. మరో 5 రోజుల్లో హాల్ టికెట్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుంది. ఐనా వీరి హాల్ టికెట్ల జారీ అంశం కొలిక్కి రాకపోవడంతో... వీణా-వాణికి అడ్మిషన్లు ఇచ్చిన స్కూల్ యాజమాన్యంలో ఆందోళన నెలకొంది.

వీణా-వాణి హాల్ టికెట్ల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీణా-వాణికి బర్త్‌ సర్టిఫికెట్‌ వేర్వేరుగా ఇచ్చారని, అలాంటప్పుడు పదో తరగతి పరీక్షలకు హాల్‌ టికెట్లు జారీ చేసే విషయంలో అధికారులు ఆలోచించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఇద్దరికీ హాల్‌టికెట్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. అంతేకాదు పరీక్షా కేంద్రంలో వీరికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి పరీక్షలు రాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, 12 ఏళ్ల వయస్సులో వీణా-వాణిలు నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోంకు మారారు. అక్కడ వారు చదువుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా టీచర్లను, ట్యూటర్లను నియమించి స్టేట్ హోంలోనే పాఠాలు చెప్పించింది. ఇక వీణావాణిలను విడదీసేందుకు దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణలు పలుమార్లు పరీక్షించారు. కవలలను విడదీసేందుకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని.. ఆపరేషన్ కు దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దాంతో వీణావాణిలను విడదీసే ప్రయత్నాలు మరుగునపడ్డాయి.

ఇక తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగుస్తాయి.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు