కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ రెండు రంగాల వాళ్లు సహాయ నిరాకరణ చేస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా తయారయ్యేవో వేరే చెప్పనవసరం లేదు. అన్ని రంగాలు కూడా తలుపులు బిగించి తాళం వేసుకున్నా, దీర్ఘకాలిక సెలవులు ఇచ్చేసుకున్నా వైద్య, పారిశుధ్య రంగాలు మాత్రం నిత్యం ప్రజలను కరోనా నుంచి రక్షించడంలో విశేష కృషి చేశాయి. ఓ వైపు డాక్టర్లు వైద్యం చేస్తూ రోగుల్లో కరోనా వైరస్ ను క్లీన్ చేస్తోంటే, మరో వైపు పారిశుధ్య కార్మికులు దుర్గంధపూరితమైన చెత్తాచెదారాన్ని ఏరి వేస్తూ ప్రజలకు కరోనా ప్రమాదాన్ని తగ్గించేలా కృషి చేశారు. వారి సేవలను గుర్తించినందునే, మొట్టమొదటగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వారితోనే ప్రారంభించారు. తాజాగా ఓ తెలుగు పారిశుధ్య కార్మికురాలు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
తెలంగాణలోని సూర్యాపేట నగరంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభించిందో అందరికీ తెలిసిందే. పేకాట ఆడటం వల్ల పదుల సంఖ్యలో కరోనా ప్రభావానికి లోనయి, ఆ సంఖ్య వందల్లోకి చేరింది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించింది. మార్కెట్ నుంచి కూడా కరోనా విజృంభించింది. అదే సమయంలో పారిశుధ్య కార్మికులు నిర్విరామంగా పనిచేసి ప్రజలకు ముప్పు తప్పించారు. సూర్యాపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు మెరుగు మార్తమ్మ అయితే ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా తన విధులను నిర్వర్తించింది. కరోనా సమయంలో ఆమె చేసిన సేవలను జాతీయ మహిళా కమిషన్ గుర్తించింది. ఆమె సేవలను కొనియాడింది. ఆమెను సన్మానించాలని నిర్ణయించింది.
జాతీయ మహిళా కమిషన్ 29వ ఫౌండేషన్ డే సందర్భంగా జనవరి 31న ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ మంత్రి చేతుల మీదుగా సన్మానం, ప్రశంసా పత్రం అందుకోనున్నారు. కరోనా సమయంలో మార్కెట్ బజార్ ప్రాంతంలో ఒక్కసారి అత్యధికంగా కరానా కేసులు నమోదు అయిన సమయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా మార్తమ్మ విశేష సేవలను అందించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఆమె పనిచేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికురాలుగా మార్తమ్మ విధులు నిర్వహిస్తున్నారు ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందారు. తన ఇద్దరు కుమారులతో కుటుంబాన్ని నడుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Possitive, Corona Vaccine, COVID-19 vaccine, Crime news, Suryapet