MLC Kalvakuntla Kavitha: ఈడీ తనను విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడాన్ని కవిత తప్పుబడుతూ అత్యవసర విచారణ జరపాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే కవిత పిటీషన్ ను ఎమర్జెన్సీగా విచారించలేమని 24వ తేదీనే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కవిత ఈనెల 20న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీం నిర్ణయంతో కవితకు షాక్ తగిలినట్లైంది. మరోవైపు ఆరోజున కవిత విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా ఈనెల 11న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు అంటే ఏకంగా 9 గంటల పాటు కవితపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విచారణ అనంతరం కవిత అరెస్ట్ కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈనెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని మళ్లీ ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటిసులపై స్పందించిన కవిత విచారణకు వెళ్తా అని చెప్పుకొచ్చారు. కానీ తీరా విచారణ రోజు వచ్చే సరికి ఆమె హాజరుపై హైడ్రామా నెలకొంది. అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని మరో తేదీన విచారణకు వస్తానని తెలిపారు. దీనితో ఈనెల 20న విచారణకు రావాలని ఈడీ కవితకు మూడోసారి నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో మొదటి రోజు సీబీఐ విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో విచారించడంపై..అలాగే రాత్రి 8 గంటల వరకు విచారణ జరపడం ఏంటని సుప్రీంలో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24న విచారణ జరుపుతామని తెలిపింది. కానీ అంతకుముందే 20న కవిత ఈడీ విచారణ ఉంది. ఈ క్రమంలో మరోసారి నిన్న ఈ పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత కోరింది. దీనితో ఈరోజు మొదటి సెషన్ లో ఈ అంశం రాగా గతంలో చెప్పినట్లు 24నే విచారణ చేస్తామని మరోసారి సుప్రీం స్పష్టం చేసింది.
అయితే 24నే విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేయడం..అంతకుముందే 20న ఈడీ విచారణ నేపథ్యంలో కవిత హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. మరి ఈనెల 20న ఏం జరగబోతుందనే దానిపైనే అందరి కళ్లు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Kalvakuntla Kavitha, Supreme Court, Telangana