శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ జెన్కో మొదటి యూనిట్లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. జీరో లెవెల్ నుంచి సర్వీస్ బే వరకు మంటలు అలుముకున్నాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు టీఎస్ జెన్కో ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాలగంగ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విద్కుత్ కేంద్రంలో 17 మంది ఉన్నట్లు సమాచారం. 8 మందిని రెస్క్యూ సిబ్బందిని కాపాడారు. మరో 9 మంది మాత్రం లోపలే ఉండిపోయారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మూడు సార్లు లోపలికి వెళ్లి దట్టమైన పొగ కారణంగా మళ్లీ వెనక్కి వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. శ్రీశైలంలో సహాయక చర్యలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దగ్గరుండి సమీక్షిస్తున్నారు.
పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న వారిలో ఏడుగురు జెన్ కో సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ ఎలక్ట్రీషన్లు ఉన్నారు. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, మోహన్‌తో పాటు ఆమ్రాన్ కంపెనీకి చెందిన రాంబాబు, కిరణ్ కూడా లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే బయటకు వచ్చిన 8 మందిలో ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థతకు గురి కావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:August 21, 2020, 06:08 IST