Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: October 1, 2019, 12:51 PM IST
గోదావరి నదిలో చేరుతున్న వ్యర్థాలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న రసాయానాలతో కూడిన వ్యర్థజలాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. దీంతో ప్రతిఏటా ఈ సీజన్లో ఇదే పరిస్తితి తలెత్తుతోంది. రసాయానాలతో కూడిన నీటిని పంటలకు అందిస్తే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కెమికల్స్ వ్యర్థాలను గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ధర్మబాద్ ప్రాంతంలోని కొన్ని ఫ్యాక్టరీల్లోని వ్యర్థ పదార్థాలను కాలువల మాదిరిగా చేసి ఆ కాలువలను గోదావరిలోకి మళ్లిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో కెమికల్స్‌తో కూడిన నీరు కూడా అందులో నుంచే వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న కొంత నీరు రంగు మారినట్లు కనిపిస్తోంది. దీంతో శ్రీరాంసాగర్‌లో నీరు నురుగులు గక్కుతు గుట్టలు గుట్టలుగా ఏర్పడుతోంది. దుర్గందాన్ని వెదజల్లుతోంది.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
ఆయకట్టు రైతులు ఈ నీటితో పంటలు సాగు చేస్తే పంటలు సరిగా పండక పోవచ్చని, దిగుబడి రాకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు తాగు నీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచే ఇస్తున్నారు. ఈ నీళ్లు తాగితే ప్రాణాలకు హాని కలుగుతుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి రసాయనాలు గోదావరిలో కలవకుండా చూడాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

గోదావరిలో మురుగు నీరు
ఇదిలా ఉండగా, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కలను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 1087 అడుగులకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే మరో 4 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల తర్వాత ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిండు కుండలా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
— పి.మహేందర్, న్యూస్18 ప్రతినిధి
Published by:
Shravan Kumar Bommakanti
First published:
October 1, 2019, 12:51 PM IST