నేడే శ్రీరామనవమి పర్వదినం. శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని భక్తకోటి ఎదురుచూసే శుభదినం. కానీ ప్రతి ఏడాదికి భిన్నంగా ఈసారి రాములోరి కళ్యాణ దర్శన భాగ్యం కొద్దిమందికి మాత్రమే దక్కనుంది. ప్రసిద్ధ భద్రాద్రి రామాలయంతో పాటు అన్ని ఊళ్లలోని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా మహమ్మారి కారణంగా దేవాలయాల్లోని అన్ని కైంకర్యాల మాదిరిగానే రాములోరి కళ్యాణాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని భద్రాద్రి ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులెవరూ భద్రాద్రికి రావొద్దని కోరారు. ఈసారి టీవీల్లోనే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు.
దేవస్థానం చరిత్రలో తొలిసారి రామయ్య కళ్యాణాన్ని ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించనున్నారు. రామాలయం నిర్మాణం చేపట్టిన మూడున్నర శతాబ్దాలలో భక్తుల భాగస్వామ్యం లేకుండా ఏనాడు ఈ విధంగా కళ్యాణం జరగలేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. రామయ్య కళ్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు సుమారు రూ. 3 లక్షలతో కళ్యాణ మండపాన్ని పుష్పాలతో అలంకరించారు. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.