Home /News /telangana /

నదులను తోడేస్తున్నారు..ఖమ్మంలో రెచ్చిపోతున్నఇసుక మాఫియా

నదులను తోడేస్తున్నారు..ఖమ్మంలో రెచ్చిపోతున్నఇసుక మాఫియా

నదులను తోడేస్తున్నారు..ఖమ్మంలో రెచ్చిపోతున్నఇసుక మాఫియా

నదులను తోడేస్తున్నారు..ఖమ్మంలో రెచ్చిపోతున్నఇసుక మాఫియా

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఇసుక అక్రమ రవాణాపై 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి పరిశోధనాత్మక కథనం..

  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం కరెస్పాండెంట్)
  ఇసుక నుంచి తైలం తీయొచ్చో లేదో గానీ పైసలు మాత్రం మస్తు పిండొచ్చని రుజువు చేస్తున్నాయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం శ్యాండ్‌ మాఫియా ముఠాలు. ఇక్కడి వీడియో క్లిప్పింగ్‌లో దృశ్యాన్ని చూస్తే మాత్రం ఎవరికైనా ఔరా అనిపించక మానదు. జోరున కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన మోకాల్లోతు బురదలో సైతం దిగబడిన ఇసుక ట్రక్కలను ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ రవాణా చేస్తున్నారు. ఇక్కడ ఎవరికీ ఏ మాత్రం భయం లేదు. జంకుగొంకూ అసలే లేదు. గతంలో ఏ అర్థరాత్రి పూటో జరిగిన ఇసుక అక్రమ రవాణా, ఇప్పుడు మాత్రం బాజాప్తుగా, పట్టపగలు ఏ మాత్రం వెరపు లేకుండా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. కారణం అక్రమ రవాణా చేస్తున్నది అధికార పార్టీకి చెందిన వారు కావడం.. పైపెచ్చు చూస్తూ ఊరుకుంటే కాస్తో కూస్తో ముట్టే అవకాశమైనా ఉంది. అందుకే ఈ విషయంలో ఎవరూ కిమ్మనరు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఇసుక అక్రమ రవాణాపై 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి పరిశోధనాత్మక కథనం..

  ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం, ముదిగొండ, ఖమ్మం అర్బన్‌, ఖమ్మం రూరల్‌, చింతకాని, బోనకల్లు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోంది. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న మున్నేరుకు రెండు వైపులా ఉన్న పల్లెల్లో ఎక్కడికక్కడ స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకుని మరీ విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాల్టా చట్టం ప్రకారం మున్నేరు నుంచి ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. అయినా ఎవరికీ పట్టదు. చట్టాలను అమలు చేయాల్సిన రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రవాణా, పోలీసు, మైనింగ్‌శాఖలు ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కారణమేంటని ఎవరిని ప్రశ్నించినా ఇసుక రవాణాలో పాలు పంచుకుంటున్నది ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందినవాళ్లే కావడం.. వారిలో స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉండడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇంతా చేస్తే ప్రభుత్వానికి ఏమైనా పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందా అంటే లేదు. కేవలం లోకల్‌ నాయకులకు మాత్రం మాంచి ఆర్జన ఉంటున్న ఈ ఇసుక రవాణాలో గ్రామాల్లో ఆధిపత్య పోరు సైతం సాగుతోంది. అధికార పార్టీకే చెందిన సర్పంచి, ఎంపీటీసీలు ఉన్న చోట పంపకాలలో సమస్యలొస్తున్నాయి. కొన్ని చోట్ల గొడవలు పడి రాస్తాకు అడ్డంగా గాడి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తిరుమలాయపాలెం ఇన్‌ఛార్జి తహశీల్దార్‌, ఎస్సైలతో పాటు తిరులాయపాలెం సర్పంచి సైతం తమ ఉద్యోగాలు, పదవుల నుంచి సస్పెండ్‌ కావడం ఇసుక అక్రమ రవాణా తీవ్రతకు నిదర్శనం. సాక్షాత్తూ జిల్లా కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించి రికార్డెడ్‌గా దొరికిపోవడంతో జిల్లా న్యాయమూర్తి ఆదేశాలతో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.

  ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం చెప్పనక్కర్లేదు. గోదావరి నది నుంచి పరిమిత సంఖ్యలో అధికారిక ర్యాంపులు ఉండగా.. ఒక డీడీతో, ఒక పర్మిట్‌తో ఎన్నోసార్లు ఎన్నో ట్రిప్పులు, అదీ ఓవర్‌లోడ్‌తో రవాణాచేయడం షరా మామూలు. ఇక ప్రభుత్వ అభివృద్ధి పనులు, స్కీముల అమలు కోసం ఇసుక అవసరమంటూ సాగే దందా వేరే. మణుగూరు మండలం జానంపేట సాంబాయగూడెం ర్యాంపు గోదావరి నదిలో ఓ కిలోమీటరు దూరం ర్యాంపు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏటూరునాగారం దగ్గరిలోని రంగాపురం ర్యాంపు నుంచి కూడా ఇదే తరహా రవాణా నిత్యకృత్యం. ఇంకా కిన్నెరసాని నది నుంచి బూర్గంపాడు మండలం ఉప్పుసాక, సోంపల్లి, అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి, చింతిర్యాల, చింతిర్యాలకాలనీ, ఆమిర్ద, నెల్లిపాకబంజర, రామచంద్రాపురం, మల్లెమడుగు, గొల్లగూడెంలలో విపరీతంగా స్టాక్‌ పాయింట్లు పెట్టి మరీ ఇసుకను రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు పేరిట పర్మిట్లు తీసుకుని ప్రైవేటుగా అమ్మకాలు సాగుతున్నాయి. ఒకవేళ ఎవరైనా పోలీసు, రెవెన్యూ, రవాణా, మైనింగ్‌ అధికారులు పట్టుకున్నా వెంటనే ఫోన్‌ మోగడం, వదిలిపెట్టడం కూడా చాలా మామూలు విషయం ఇక్కడ.

  కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్ కావడంతో కొద్ది నెలలు నిర్మాణ రంగం నిలిచిపోయినా.. లాక్‌డవున్‌ ఎత్తివేయడంతో మళ్లీ ఈ మధ్యనే పుంజుకుంది. దీంతో ఇసుక రేట్లకు రెక్కలొచ్చాయి. గోదావరి ఇసుక టన్ను రూ.2300 ఉండగా, స్థానికంగా లభ్యమయ్యే ఇసుక ట్రాక్టర్‌ ట్రక్కు రూ.8500 దాకా రేటు ఉంది. దీంతో ఇసుక అక్రమ రవాణా ముఠాలు వేగం పెంచాయి. పైపెచ్చు వర్షాలకు నదీ ప్రవాహాలు పెరగడం వల్ల లోపలకి వెళ్లి ఇసుక తీసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న స్టాక్‌ పాయింట్ల నుంచి రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన స్థానిక అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడంతో, ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు టాస్క్‌ఫోర్స్‌ విభాగం దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటికే వేల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసింది. అయినా కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా మాత్రం ఎక్కడా ఆగిన దాఖలా లేదు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bhadradri kothagudem, Khammam, Sand mafia, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు