Telangana: వనం బాట పట్టిన వానరం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన మంత్రి హరీశ్‌రావు

Telangana: వనం బాట పట్టిన వానరం.. ప్రత్యేక చర్యలు చేపట్టిన మంత్రి హరీశ్‌రావు

బంధించిన కోతులను అడవికి తరలిస్తున్న బృందం సభ్యులు

Siddipeta: వానరులను మనం దైవంగా భావిస్తాం కానీ అవే ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబ డి చుక్కలు చూపిస్తున్నాయి. అడవిలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఊళ్లల్లోకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

  • Share this:
    కోతులు తమ మీదకు ఎగబడుతున్నాయ్‌.. గాయపరుస్తున్నాయ్‌.. ఇంటి లోపలకు వచ్చి వస్తువులను చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయ్‌ సార్‌ అంటూ.. గత కొంత కాలంగా సిద్దిపేట జిల్లా వాసులు మంత్రి హరీశ్‌రావును కలిసి వాటి బెడద నుంచి మమ్మల్ని కాపాడండంటూ విన్నవించారు. వారి విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని కోతుల బెడదను నివారించాలనే ఉద్దేశ్యంతో మంత్రి హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేట నుంచి ప్రత్యేక బృందంచే రెండు నెలల నుంచి పట్టణంలో కోతుల నివారణ చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదు చేసిన ప్రతీ కాలనీకి బృందం పర్యటించింది.  సిద్దిపేట పట్టణంలో ప్రతీ వీధిలో బోనును ఏర్పాటు చేశారు. బోనులల్లో వేసిన కోతులు 250 కు చేరగా వాటిని‌ ప్రత్యేక వాహనం ద్వారా నిర్మల్‌ అడవికి తరలించారు. ఇలా రెండు సార్లు తరలించడంతో 500 పైగా కోతులను అడవికి వాపస్‌ పంపించారు.

    వానలు వాపస్‌ రావాలంటే వానరులు వనం బాట పట్టాలి..
    వానలు వాపస్‌ రావాలంటే వానరులు అడవికి వెళ్లాలి అనేది పాట మాత్రమే కానీ ఇప్పుడు ఆ పాట నిజం అయింది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసి కోట్లాది రూపాయలతో మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టింది. అడవులు పెరిగితే కోతులు అక్కడే ఉండి తమకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకొని అడవిని వదిలి పట్టణాలకు రాకుండా ఉంటాయి. అక్కడ సరిగా ఆహారం దొరక్క అవి పట్టణం బాట పట్టి పంట పొలాలపై, పట్టణంలోని ఇళ్లలోకి చేరి వాటి ఆకలిని తీర్చుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో అడవులు అభివృద్ధి చెందాయి. వానలు వాపస్‌ వచ్చాయి.. ఇక వానరులు కూడా వనం బాట పట్టాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి సారించి కోతుల నివారణకు చర్యలు ప్రారంభించామన్నారు.

    monkeys, siddipeta, hareeshrao
    కోతులను బోనులో బంధించిన దృశ్యం


    నాడు పందులు, నేడు కోతులు..
    నాడు ఏ వీధికి వెళ్లినా పందులతో ఇబ్బందులకు గురవుతున్నట్లు కాలనీ వాసులు తన దృష్టికి తీసుకురాగా వాటిని లేకుండా పూర్తిగా నివారించినట్లు మంత్రి అన్నారు. అలాగే ఇప్పుడు కోతుల బెడద ఎక్కువగా ఉండగా వాటిని నివారించడానికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చడంలో, వాటిని పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి దేనిలో లేదని.. ఆ ఆలోచనతో రెండు సందర్భాలు తనకు సంతృప్తినిచ్చినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. అదే విధంగా పట్టణంలో కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని అందుకు ఎనిమల్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ... త్వరలోనే కుక్కల బెడదను కూడా నివారించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.  ఆ దిశగానే కోతులను అడవికి సురక్షితంగా చేర్చడం జరిగిందన్నారు.
    Published by:Veera Babu
    First published: