కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం మరింత ఆకర్షణగా మారనుంది.. మానేరు రివర్ డెవలప్‌మెంట్‌తో మానేరు వాగును సుందరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలోలో దానికి తోడుగా వాగుపై కేబుల్ బ్రిడ్జి మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రీడ్జిపై లోడ్‌టెస్ట్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం అయిదు రోజుల పాటు లోడ్ టెస్ట్ పనులు కొనసాగిన అనంతరం పూర్తిస్థాయిలో దీన్ని వినియోగంలోకి తేనున్నారు. ఇందుకోసం అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది..దీంతో కరీంనగర్ మానేరు డ్యాంకు మరింత శోభను తీసుకురానుంది.
సిఎం హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కెసిఆర్... కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. ఇందుకోసం కేబుల్ బ్రిడ్జీ... మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మించాలని తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్... ఇటు వరంగల్ వెళ్ళాల్సిన వాహనాలన్ని కూడా అలుగునూర్ బ్రిడ్జీ పై నుండి వెళ్ళాల్సి వస్తుండడంతో... తరచు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో... ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... వరంగల్ కు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే మంచిదని పాలకులు భావించారు. కొత్తగా నిర్మించే రోడ్డు వరంగల్ తో పాటు దక్షిణ భారతాన్ని కలిపే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆకాంక్షలకు అనుగుణంగా... కరీంనగర్- సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ మార్గం పై 149 కోట్ల రూపాయలతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు.
దీంతో కరీంనగర్ ఎల్ఎండి వద్ద కొనసాగుతున్న బ్రిడ్జి తుది మెరుగులు దిద్దుకుంటుంది. అనంతరం కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలిచి... పర్యాటక శోభను పంచనుంది. ఇలాంటి కేబుల్ బ్రిడ్జిలు ఉత్తర భారతదేశంలోని హౌరా... ముంబైలలో ఉండగా... దక్షిణ భారతంలోనే తొలిసారిగా కేబుల్ బ్రిడ్జీ ఇక్కడ నిర్మాణమవుతుంది. అత్యంత ఆధునికంగా సుందరంగా నిర్మాణమవుతున్న ఈ కేబుల్ బ్రిడ్జీ... ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లను తగ్గించనుంది. వెయ్యి టన్నుల కెపాసిటీ ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జీ పై ఎంతటి బరువైన వాహనాలైన వెళ్ళేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు.
అంతే కాకుండా... ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను డిస్ ప్లే చేసేందుకు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. - ఇప్పటికే కేబుల్ బ్రిడ్జీ పనులు పూర్తికాగా... వంతెన పై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు... ఫుట్ పాత్ పై ప్రజలు వెళ్ళడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని... శుక్రవారం నుండి బ్రిడ్జీ పై లోడ్ టెస్ట్ ను ప్రారంభించారు. ఈ లోడ్ టెస్ట్ మంగళవారం వరకు అంటే 5 రోజుల పాటు కొనసాగనుంది.
ఇది ఇలా ఉంటే... కేబుల్ బ్రిడ్జీ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు... కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందుకోసం 34 కోట్ల రూపాయలతో విశాలమైన రోడ్లను నిర్మించనున్నారు. కరీంనగర్ కమాన్ నుండి సదాశివపల్లి వరకు తీగెల వంతెన నిర్మాణం పోగా... మిగతా 4.7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు... అలాగే సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జీ వరకు రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తైతే... వెంటనే తీగల వంతెన పైకి వాహనాలు వెళ్ళేందుకు అనుమతించనున్నారు.
- సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేబుల్ బ్రిడ్జికీ... ఆదునాతనమైన లైటింగ్ మరింత శోభను తీసుకురానున్నారు. 8 కోట్ల రూపాయలతో రాత్రి వెళల్లో పర్యాటకులను అలరించే విధంగా... తీగల వంతెన పై రంగు రంగుల డిజిటల్ లైటింగ్... ఇతర ఆకర్షణీయ పనులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gangula kamalakar, Karimnagar, Telangana