ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మహబూబాబాద్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్ కుమారుని చికిత్సకు హామీ ఇచ్చారు. దీంతో గత ఆరేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న ఆ దంపతులకు ఊరట దొరికినట్లయింది. డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీసకు చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మిల కుమారుడు హర్షవర్దన్‌కు చిన్నప్పటి నుంచి లివర్ సమస్య ఉంది. ఎంత మంది వైద్యుల దగ్గరకు వెళ్లినా ఉపయోగం లేదని పెదవి విరిచారు. కేవలం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే పరిష్కారమన్నారు. దీనికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే నాగరాజుకు అంత ఖర్చు పెట్టుకునే స్తోమత లేక అలాగే ఉండిపోయారు. ఫలితంగా హర్షవర్దన్ పొట్ట భాగం రానురాను బాగా వాచిపోయింది. పలుమార్లు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చూపించినా లివర్ మార్పిడి తప్ప వేరే దారిలేదని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నకొడుకును చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే కరోనా లాక్‌డవున్ సమయంలో ఎంతోమంది పేదలను, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్న సోనూసూద్ గురించి తెలుసుకున్న నాగరాజు మిత్రుడు రంజిత్ సోషల్ మీడియా ద్వారా సోనూసూద్‌ను సంప్రదించారు. తను ఇచ్చిన సమయానికి బాలుడు హర్షవర్దన్, తల్లిదండ్రులను తీసుకెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితి వివరించారు. అప్పటికప్పుడు స్పందించిన ఆ మానవతావాది తనకు తెలిసిన వైద్యులను సంప్రదించి ఎంత ఖర్చవుతుందో తెలుసుకున్నారు. బాబుకు సరైన వైద్యం అందించడానికి అవసరమైన రూ.20 లక్షలను తాను ఇవ్వడానికి హామీ ఇచ్చారు. వారికి కొండంత ధైర్యం అందించారు. దీంతో ఆ తల్లిదండ్రులు ధైర్యంగా ఇంటిముఖం పట్టారు. సోనూసూద్ సహకారంతో తమ కుమారునికి త్వరలోనే ఆపరేషన్ నిర్వహిస్తామని, అందరు పిల్లల్లా తమ బాబుకూడా బడికెళ్లడం, ఆడుకోవడం చూడాలన్న తమ కోరిక తీరనుందని తెలిపారు.

డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీసకు చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మిల కుమారుడు హర్షవర్దన్
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నవారిని తన సొంత డబ్బులతో బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపిన సోనూసూద్ ఒక్కసారిగా దేశంలో ఆపద్భాందవుడు అయిపోయాడు. ఆ తర్వాత కూడా చాలా మందికి చాలా రకాలుగా సాయం చేశాడు. కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు చెందిన ఓ యువతికి కరోనా లాక్ డౌన్ వల్ల ఉద్యోగం పోవడంతో ఆమెకు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో జాబ్ ఇప్పించాడు. అలాగే, ఏపీలోని చిత్తూరు జిల్లాలో పొలం దున్నడానికి ఎద్దులు లేక కాడిపట్టిన అక్కాచెల్లెళ్లను చూసి చలించి పోయి ఏకంగా వారికి ట్రాక్టర్ కొనిపెట్టాడు.

సోనూసూద్ ఇచ్చిన ట్రాక్టర్‌తో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు
అయితే, సోనూసూద్ కు రహస్య ఎజెండా ఉందని, ఆయన రాజకీయాల్లోకి వస్తారని కామెంట్లు చేసే వారు కూడా లేకపోలేదు. ఆయన ఒక్కడే ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడని కొందరు ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించారు. సాధ్యమైనంత మందికి సాయం చేయడమే తన మిషన్ అని స్పష్టం చేశారు. తనతో పాటు, తన కుటుంబ సభ్యులకు సాయం కోసం అనేక ఈమెయిల్స్ వస్తున్నాయన్నారు. వారిలో అత్యవసర సాయం ఎవరికి కావాలో గుర్తించి తన వంతుగా వారికి సహాయం చేస్తున్నామన్నారు.
నీతి గోయల్ అనే మిత్రుడు తాను వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేసే సమయంలో సహకరించాడని చెప్పారు. అనంతరం తనతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనేక మంది ముందుకు వచ్చారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది యువకులు తనతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రతీ ఒక్కరు ఇతరులకు సాయం చేస్తే దేశం మారిపోతుందన్నారు. గత పదేళ్లుగా తనకు రాజకీయాల్లోకి రావాలని అనేక ఆహ్వానాలు వచ్చినా ఆసక్తి చూపలేదన్నారు. ప్రస్తుతం తనకు ఆ ఆసక్తి లేదన్నారు.