Home /News /telangana /

Online fraud : అమెజాన్‌లో మొబైల్‌ బుక్ చేస్తే.. సబ్బులొచ్చాయి.. థర్డ్‌ పార్టీలతో అమెజాన్‌ సంస్థకు మచ్చలు..

Online fraud : అమెజాన్‌లో మొబైల్‌ బుక్ చేస్తే.. సబ్బులొచ్చాయి.. థర్డ్‌ పార్టీలతో అమెజాన్‌ సంస్థకు మచ్చలు..

అమెజాన్‌లో మొబైల్‌ బుక్ చేస్తే.. సబ్బులొచ్చాయి.. థర్డ్‌ పార్టీలతో అమెజాన్‌ సంస్థకు మచ్చలు..

అమెజాన్‌లో మొబైల్‌ బుక్ చేస్తే.. సబ్బులొచ్చాయి.. థర్డ్‌ పార్టీలతో అమెజాన్‌ సంస్థకు మచ్చలు..

Online fraud : ఆన్‌లైన్ వ్యాపారం దేశంలో పుంజుకుంటున్న తరుణంలో కొన్నిథర్డ్ పార్టీ కంపనీలు చేస్తున్న అక్రమాలకు వాటిపై ఉన్న భరోసా తగ్గుతోంది..ఈ క్రమంలోనే మరోసారి మొబైల్ బుక్‌చేస్తే...సబ్బులు వచ్చిన సంఘటన ఖమ్మంలో చేటుచేసుకుంది.

  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  ఖమ్మం నగరంలోని బుర్హాన్‌పురంలో నివాసం ఉండే చకిలం అచ్యుత్‌కుమార్‌ తన తల్లి పేరిట అమెజాన్‌ ఆన్‌లైన్‌ ఈకామర్స్‌ యాప్‌లో ఓ మొబైల్‌ ఫోన్‌ బుక్‌ చేశారు. రియల్‌మి కంపెనీకి చెందిన సీ15 మోడల్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఆర్డర్‌ చేశారు. దీనికిగానూ రూ.10,500 మొత్తాన్ని ముందే చెల్లించారు. దీనికిగానూ అమెజాన్‌ షిప్‌మెంట్‌ నెం.ఏడబ్య్లుపీ 263856021920 తో డెలివరీ అయింది. ముందే పేమెంట్‌ చేశారు కనుక, వాళ్లు డెలివరీ సమయంలో ఎలాంటి సందేహానికి గురికాలేదు. ఆనక తీరిగ్గా వచ్చిన ప్యాక్‌ను ఓపెన్‌ చేశారు. ఎందుకైనా మంచిదన్నట్టుగా ఓపెన్‌ చేసిన సమయంలో మొత్తాన్ని వీడియా తీశారు. అంతా చక్కగానే ఉంది. ప్యాక్‌ చేసిన తీరు.. ఎక్కడా సీల్‌ బ్రేక్‌ అయినట్టుగా లేదు. అయినా మొత్తం ఓపెన్‌ చేసి చూస్తే మొబైల్‌ ఫోన్‌ రాలేదు సరికదా.. వాటి స్థానే ఓ రెండు రకాలకు చెందిన ఐదు సబ్బులు వచ్చాయి.

  దీంతో షాక్‌ అయిన అచ్యుత్‌కుమార్‌ చకిలం అందుబాటులో ఉన్న నెంబరుకు ఫోన్‌ చేసి జరిగిన మోసాన్ని వివరించారు. దీనిపై అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్న హామీతో స్థిమితపడ్డారు. సహజంగా అమెజాన్‌లో బుక్‌ చేస్తే గ్యారంటీ అన్న నమ్మకం అందరికీ ఏర్పడింది. ఇలా మొబైల్‌ స్థానే సబ్బులు రావడంతో అందరూ షాక్‌ తిన్నారు.

  ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో ఈకామర్స్ రంగం ఊపందుకుంది. ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఎక్కడి ప్రొడక్ట్‌ అయినా నిర్ణీత వ్యవధిలో ఇంటికి చేరే సౌలభ్యం వచ్చేసింది. మొదట్లో చిన్నచిన్న మోసాలు జరిగినట్టు రిపోర్టు అయినా ఈ మధ్య కాలంలో పెద్దగా ఎక్కడా లేవన్నట్టే ఉంది. దీంతో ఈకామర్స్‌పై ప్రజల్లో నమ్మకం క్రమంగా పెరిగింది.

  పైపెచ్చు కోవిడ్‌ దెబ్బకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఓ ప్రత్యామ్నాయంగా మారిన పరిస్థితి. దీంతో దాదాపు ఎక్కువ శాతం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్ల ద్వారా యాప్‌లోనే తమకు కావాల్సిన వస్తువులను బుక్‌ చేసుకుంటున్నారు. ఇది ఓ బలమైన ప్రత్యామ్నాయంగా రూపొందింది. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి మోసాలు ఈకామర్స్‌ పై అపనమ్మకం కలుగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఇలా ఖమ్మంలో అప్పుడప్పుడూ ఇలాంటి మోసాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇది ఒక్క అమెజాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో అనేకమార్లు ఫ్లిప్‌కార్ట్‌, ఇంకా స్నాప్‌డీల్‌, ఆలిబాబా, మింత్ర లాంటివాటిల్లోనూ జరిగిన దాఖలాలున్నాయి.

  ఈ విషయమై అమెజాన్‌ కు సంబంధించిన ఖమ్మం సిటీ డీలర్‌ పల్లా జాన్‌ ను 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి సంప్రదించగా జరిగిన మోసం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తాము ఇటు కస్టమర్‌తో మాట్లాడామని, కంపెనీకి చెందిన స్పెషల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ టీంకు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటివి ఎంఎఫ్‌ఎన్‌ (మర్చంట్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌) అంటే థర్డ్‌ పార్టీ ప్యాకేజింగ్‌ వల్ల జరుగుతాయని.. సాధారణంగా ఏఎఫ్‌ఎన్‌ (అమెజాన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ నెట్‌వర్క్‌) ద్వారా జరిగిన దాఖలా లేదన్నారు. గతంలో మధిరలో ఒక ఫిర్యాదు ఇలాంటిదే వస్తే, వెంటనే కంపెనీ తరపున కఠిన చర్యలు తీసుకోవడం జరుగిందని, ఇలాంటివి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. ఎక్కడైనా ఇలాంటివి వస్తే కంగారు పడకుండా, సంబంధిత సంస్థకు లేదా డీలర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వస్తుందన్నారు. మెయిల్‌ చేసినా తాము ఫాలో చేస్తామని స్పష్టం చేశారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Amazon, Khammam, Online fraud

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు