(K.Lenin,News18,Adilabad)
కొమురంభీమ్ ఆసిఫాబాద్(Asifabad)జిల్లాలో మావోయిస్టు పార్టీ(Maoist party)లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ముగ్గురు మావోయిస్ట్ సానుభూతి పరులను జిల్లా పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పేలుడు సామాగ్రి(Explosives)ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మావోయిస్టుల మోసపూరిత మాటలు విని జీవితాల్ని నాశనం చేసుకోవద్దని సూచించారు జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్(Suresh kumar).
ఆరుగురు అరెస్ట్ ..
మావోయిస్టుల్లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ముగ్గురు సానుభూతి పరుల్ని కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బెజ్జూర్ మండలంలోని కుష్ణపెల్లి దగ్గర ఆరుగురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడిన ఆరుగురి దగ్గర నుంచి పేలుడు పదార్ధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. 53 డిటోనేటర్‌లు, 27 జిలేటిన్ స్టిక్స్ లభించాయని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. పోలీసులకు పట్టుబడిన వాళ్లలో బెజ్జూరు మండలానికి చెందిన వాడే హనుమంతు, కౌటాల మండలంలోని జనగాం గ్రామానికి చెందిన నాగపురే చక్రపాణి అలియాస్ చత్రు, జాడే ఎక్ నాథ్, జాడే శాంతారాంతో పాటు మురళిగూడకు చెందిన వాడే హనుమంతు అనే మావోయిస్ట్ కొరియర్ ద్వారా మావోయిస్టులలో చేర్పించే ప్రయత్నం జరుగుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
వాహనాలు తనిఖీ చేస్తుండగా..
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు , భూ , వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్న వారిని గుర్తించి మావోయిస్టు దళంలో చేరేలా చూడాలని మావోయిస్టులు వాడే హనుమంతుకు బాధ్యత అప్పగించారు. అతను ఇలాంటి పరిస్థితుల్ని గుర్తించిమావోయిస్టు దళంలో చేర్చేందుకు ముగ్గురు వ్యక్తులను మరో ముగ్గురు కలసి తీసుకు వెళ్తుండగా వాహనాల తనిఖీలు చేస్తుండడం తో వీరు దొరికి పోయారని వివరించారు. మావోయిస్టు లలో చేరకుండా వీరిని గుర్తించి పట్టుకున్న కౌటాల సీఐ బుద్దే స్వామీతో పాటు బేజ్జూర్ ఎస్సై వేంకటేశ్‌ను ఎస్పీ అభినందించారు. మావోయిస్టులు సమస్యలున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి దళంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు ఎస్పీ.
తప్పుడు నిర్ణయాలు సరికాదు..
మావోయిస్టుల మోస పూరిత మాటలు నమ్మి జీవితాలను పాడుచేసుకోవద్దని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎస్.పి సూచించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏలాంటి భూ సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఉండేలా చేస్తున్నప్పటికీ మావోయిస్టుల ఉచ్చులో పిడ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇకపై అలాంటివి చేయకుండా ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్స్, గ్రూప్స్ పరీక్షలు వంటి వాటికి విద్యార్థులు, యువకులు ప్రిపేర్ కావాలని సూచించారు. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థిని విద్యార్థులు, చదువుకునే వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే పోలీసువారి దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అంతే కాదు గ్రామాల్లో కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తే వారికి సహాయం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Maoists, Telangana News