కరోనా కేసులు నెమ్మదిస్తున్న వేళ కరోనా భయం కొద్ది రోజులుగా భయాందోళనలకు గురిచేస్తోంది. పక్షులు చనిపోతే చాలు బర్డ్ ఫ్లూ ఏమోనని జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు కేంద్రం ప్రకటించగా.. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ భయం నెలకొంది. ఏ కారణం చేత పక్షులు చనిపోయిన ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నిజమాబాద్ జిల్లాలో ఆరు నెమళ్లు మృతి చెందడం.. స్థానికంగా బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజమాబాద్ జిల్లాలోని గుండారం గ్రామ శివారులోని శంభుని ఆలయ సమీపంలో ఆరు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. గురువారం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి సర్పంచ్ లక్ష్మణ్‌రావుకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. అయితే ఆరు నెమళ్లు ఒకేసారి మృతిచెందడంతో బర్డ్ ఫ్లూ అనే అనుమానాలు చోటుచేసుకున్నాయి.
గటన స్థలానికి చేరుకున్న అధికారులు చనిపోయిన నెమళ్లను పరిశీలించారు. అయితే నెమళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోలేదని నిర్దారణకు వచ్చారు. పొలాల్లో చల్లిన క్రిమిసంహార మందులు వేసిన కలుషిత నీటిని తాగడం వల్లే నెమళ్లు అస్వస్థతకు గురై చనిపోయాయని అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అనంతరం మృతిచెందిన నెమళ్లను అటవీ ప్రాంతంలోని భూమిలో పూడ్చి పెట్టారు. ఇక, నెమళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మరణించలేదని తెలియడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.