(K.Veeranna,News18,Medak)
అన్నచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగానే రాఖీ పండుగ జరుపుకుంటారు. అందుకే రాఖీ పౌర్ణమి(Rakhi pournami)రోజున అన్న, తమ్ముళ్లు ఎంత దూరంలో ఉన్నా అక్క, చెల్లెళ్లు వెళ్లి మరీ రాఖీ కట్టించుకోవడం తరతరాలుగా వస్తోంది. ఏ వ్యక్తికైనా జీవితంలో అప్పటి వరకు ఉన్న బంధాలు మరణంతో తెగిపోతాయి. ఎంత ఆత్మీయులైనా మరణించారని తెలిసిన వెంటనే క్షణంలో బాధపడి మర్చిపోవడం సర్వసాధారణమైన విషయం. కాని సిద్దిపేట(Siddipet)జిల్లాలో మాత్రం తమ సోదరుడు చనిపోయి 8ఏళ్లు గడిచినప్పటికి వాళ్లు మాత్రం ఇంకా అతడ్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.
సోదరుడి విగ్రహానికి రాఖీ ..
కళ్ల ముందు తిరుగుతూ..ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నప్పటికి తోడబుట్టిన అన్న, తమ్ముళ్లను ఆప్యాయంగా పలకరించని రోజులు ఇవి. అలాంటిది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాలో చనిపోయిన తమ సోదరుడిని విగ్రహం రూపంలో చూసుకొని మురిసిపోతున్నారు ఆతని ఆడపడుచులు. రాజుతండాకు చెందిన వీర జవాన్ గుగులోతు నరసింహ నాయక్ సీఆర్పీఎఫ్ జవానుగా పని చేసేవాడు. 2014లో చత్తీస్‌గడ్‌లో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలిన దుర్ఘటనలో నరసింహ నాయక్ వీరమరణం పొందాడు. నరసింహనాయక్‌కి అక్క, చెల్లెళ్లు ఉన్నారు. వారంతా ప్రతి ఏడాది తమ సోదరుడికి రాఖీ కట్టే వాళ్లు. అయితే 8ఏళ్ల క్రితం నరసింహనాయక్ చనిపోవడంగా అతనికి గుర్తుగా గ్రామంలో సమాధి దగ్గరే విగ్రహం ఏర్పాటు చేశారు.
నిజమైన రక్తసంబంధం..
తోడబుట్టిన వాడు భౌతికంగా లేకపోయినప్పటికి అతని ఆడపడుచులు మాత్రం చనిపోయిన వీరజవాన్ నరసింహనాయక్‌ని విగ్రహం రూపంలో చూసుకుంటున్నారు. ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజున నరసింహనాయక్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు అక్క, చెల్లెళ్లు కలిసి సోదరుడి సమాధి దగ్గరకు చేరుకుంటారు. ఒక్కగానొక్క సోదరుడు దూరమైనందుకు చింతిస్తూనే అతని విగ్రహానికి రాఖీలు కడుతున్నారు. నరసింహనాయక్ చనిపోయిన మరుసటి ఏడాది నుంచి ఈవిధంగా రాఖీలు విగ్రహానికి కడుతూ తమ సహోదరుడు ఇంకా బ్రతికే ఉన్నాడని విగ్రహాన్ని చూసి సంతోషపడుతున్నారు.
భౌతికంగా లేకపోయనా..
ప్రతి అక్క,చెల్లి తన సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఎంతో సంతోషంగా ఉంటుంది. కాని నరసింహనాయక్‌కు రాఖీ కడుతూ అతని అక్క, చెల్లెళ్లు ప్రతి సంవత్సరం కన్నీరు పెడుతూ రాఖీలు కడుతున్నారని నరసింహ నాయక్ తండ్రి లింగయ్య నాయక్ తెలిపారు. కొడుకు సైన్యంలో చేరి నక్సలైట్ల మందుపాతరకు బలైపోతే ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్దాప్య దశలో ఉన్న తమను చిన్న కుమార్తె చూసుకుంటోందని ..ఆమెకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వీర జవాన్ నరసింహనాయక్ తండ్రి లింగయ్య నాయక్ తల్లి సత్తమ్మ కోరుతున్నారు. అమర జవాన్ నరసింహ నాయక్ విగ్రహానికి ఆతని అక్క, చెల్లెళ్లు వచ్చి రాఖీలు కట్టడాన్ని స్థానికులు చూసి వీడియోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలే వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raksha Bandhan, Siddipet, Telangana News