(శ్రీనివాస్. పి. న్యూస్18తెలుగు ప్రతినిధి)
దీపావళి (Diwali) పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు (Singareni Collieries) తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనన్ అందించనుంది. రూ.296 కోట్ల కార్మికులకు బోనస్‌గా అందజేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ.76,500 బోనస్ అందించనున్నారు. ఈ మొత్తం ఈనెల 21న వారి ఖాతాల్లో జమ కానుంది. ఇదిలా ఉండగా సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు దసరా (Dussehra) పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా (రూ.368 కోట్లు), దీపావళి (రూ.296 కోట్లు) బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి రూ.664 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున రూ. లక్షా 60 వేల వరకూ రానున్నాయని సింగరేణి యాజమాన్యం తెలిపింది. దీనికి సంబందించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.
మొత్తం సింగరేణి కార్మికులు 43,895 మంది ఉండగా.. అందరికి దీపావళి బోనస్ కింద రూ.72500 ఇస్తారు. గరిష్టంగా రూ.76,500 పొందే అవకాశముంది. ఇందుకోసం సింగరేణి సంస్థ బడ్జెట్‌ను రెడి చేసింది. ఆ డబ్బులను ఈ నెల 21వ తేదీన కార్మికుల ఖాతాల్లో జమ చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సింగరేణి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాన్ని ఆదేశించింది. బొగ్గు కార్మికుల ముఖాల్లో సంతోషం చూడాలిన్నదే దీని ఉద్దేశ్యమే అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ సొమ్ము ను కార్మికులు కుటుంబసంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సింగరేణి సీఎండీ సూచించారు. అందరూ కష్టపడి పనిచేస్తే.. ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించవచ్చని అన్నారు. తద్వారా ఇటు సింగరేణికి, అటు కార్మికుని కుటుంబానికి.. ఇద్దరికీ మేలు జరుగుతుందని చెప్పారు.
ఈ ఏడాది సైతం 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని సింగరేణి కార్మికులకు ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో మాత్రమే లాభాల వాటాను బోనస్ రూపంలో కార్మికులకు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, యూనియన్ నాయకులకు శ్రీధర్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.