జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
ఓ కుగ్రామం నుంచి ప్రారంభమైన సిక్కిరెడ్డి తండ్రి నెలకుర్తి కృష్ణారెడ్డి జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని తన బిడ్డను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగారు. స్వతహాగా క్రీడాకారుడు కావడంతో ఆటల పట్ల ఆయనకు ఉన్న మక్కువ ఆమెలో ఉన్న స్పార్క్‌ను గుర్తించేలా చేశాయి. 2002లో ఎల్బీ స్టేడియంలో జరిగిన పుల్లెల గోపీచంద్ అకాడమీ సెలక్షన్స్‌లో పాల్గొన్న నాలుగొందల మందిని వెనక్కు నెట్టి తన అద్భుత ప్రతిభతో మొదటి స్థానం సంపాదించిన సిక్కిరెడ్డి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే గోపీచంద్ అకాడమీలో అడుగుపెట్టింది.
ఇక అక్కడ తన కఠోర శ్రమ, అంకితభావం, క్రమశిక్షణతో పలు టోర్నీలలో తన సత్తా చాటుకుంది. ఇప్పటిదాకా ఆమె వందకు పైగా టోర్నీలలో పాల్గొని పది బంగారు పతకాలు, ఐదు రజత పతకాలు, మూడు కాంస్వ పతకాలు సాధించారు. ఇంతటి ప్రతిభ దాగున్న నిరంతర శ్రమ మాత్రం సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డిది.
పోలీసుశాఖలో పనిచేస్తున్న కృష్ణారెడ్ది స్వతహాగా వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం జయపురం స్వగ్రామం. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఆయన దృష్టి మాత్రం నిరంతరం కుమార్తె కెరీర్‌పైనే.
ఎన్నో సవాళ్లు..
ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఆయన నిరంతరం కుమార్తె కెరీర్‌పైనే ఆలోచిస్తుంటారు. ఆమెకు కావాల్సినవి అన్నీ సమకూర్చడం.. నిరంతరం ఆమెను వెన్నంటి ఉండడం.. ఫిట్‌నెస్‌కు సహకరించడం.. వీటితో బాటు ఓ క్రీడాకారిణిగా కావాల్సిన పోరాట పటిమను నిత్యం ఆమెకు అందిస్తూ తండ్రిగా తన కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేర్చారు.
తాను స్వతహాగా క్రీడాకారుడు కావడంతో నాలుగో తరగతిలోనే తన కుమార్తెలో ఉన్న ప్రతిభను, ఆసక్తిని గుర్తించి ఆమెను ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎడమచేతి వాటం ఆటగాళ్లకు ఉండే అడ్వాంటేజిని పసిగట్టి ఆమెకు అవసరమైన తర్ఫీదు ఇప్పించారు. ఇక కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నోసార్లు గాయాలపాలైనా.. రెండుమార్లు మోకాలికి శస్త్రచికిత్సలు చేసినా ఆమె విజయాలపై ఏమాత్రం ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో తండ్రి కృష్ణారెడ్డి, తల్లి మాధవి సక్సెస్ అయ్యారు.
2010లో మలేసియాలో ఆడుతుండగా జారిపడ్డ సిక్కిరెడ్డి మోకాలికి ఆపరేషన్ చేశారు. తర్వాత మళ్లీ 2013లో మరోసారి జారిపడడంతో ఆపరేషన్ చేయించారు. ఇలాంటి కఠినమైన సమయాల్లో ఆమె వెంట నిలిచి ఆమెను వెన్నంటే ఉండి ప్రోత్సహించడంతో ఆమె తదనంతరం జరిగిన చైనా సూపర్ సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
ఫాదర్స్‌డే సందర్భంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ కేవలం కఠోర శ్రమ, పట్టుదలతోనే తన కుమార్తె సిక్కిరెడ్డి విజయాలు సాధ్యమయ్యాయన్నారు. క్రీడలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అర్జున అవార్డుకు ఎంపిక అయినపుడు తమ సంతోషానికి అవధులు లేవన్నారు. సిక్కిరెడ్డి సైతం తన విజయాలకు పునాది వేసిన తండ్రికే ఆమెకు వచ్చిన అవార్డును అంకితం ఇవ్వడం తండ్రీబిడ్డల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fathers Day 2021, Happy Fathers Day, Khammam