సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ చనిపోయాడు. అతడి ప్రాణాలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి వరదలో కొట్టుకుపోయింది. ప్రమాదం నుంచి క్లీనర్ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్ నీటి ఉధృతికి ప్రవాహం లో కొట్టుకు పోయి మరణించాడు. డ్రైవర్ ప్రవాహంలో చిక్కుకున్నాడని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్థానిక ఆర్డీఓను ఘటన జరిగిన స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. మంత్రి, కలెక్టర్ సూచనతో అధికారులు ఘటన జరిగిన స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. ఉదయం 08.00 గంటలకే హెలికాప్టర్ పంపవల్సిందిగా కోరినా సైన్యం ను ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ రాక ఆలస్యం అయ్యింది.
మరోవైపు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రవాహ ఉధృతి పెరిగింది. స్థానిక ప్రజలు లైఫ్ జాకెట్ అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఘటనాస్థలికి చేరుకున్న సీపీ, రెస్క్యూ బృందాలు డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాయి. చెట్టుకు పట్టుకొని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు తాడు సాయంతో ప్రయత్నంచగా.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మట్టి గడ్డ పై ఉన్న చెట్టు తో సహా డ్రైవర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అనంతరం డ్రైవర్ ఆచూకీ కోసం హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటు సాయంతో వాగులో గాలింపు చేపట్టాయి. చివరగా డ్రైవర్ మరణించినట్టు అధికారులు గుర్తించారు.