ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టులో ఇలా..
ఇక నేడు ఈ కేసుకు సంబంధించి హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని బీజేపీ పిటీషన్ వేసింది. అలాగే ఇదే డిమాండ్ పై మరికొన్ని పిటీషన్లు వచ్చాయి. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు మరోసారి నిందితుల తరపు వాదనలు విననుంది కోర్టు.
కాగా గతంలో కూడా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. అయితే తప్పు చేయనప్పుడు తెలంగాణ సిట్ (Special Investigation Team) కు ఎందుకు సహకరించడం లేదు, దేనికి భయపడుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని దవే చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వీడియో ద్వారా బయటపెట్టారు. ప్రభుత్వాన్ని కూల్చుతుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని అన్నారు. కేసీఆర్ వీడియోలను బయటపపెట్టడాన్ని తప్పుగా చూయించడం ఏంటని దవే వాదనలు వినిపించారు. సిట్ (Special Investigation Team) విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే కోర్టు ముందు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే చెప్పుకొచ్చారు.
ఈ కేసు రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే సిట్ (Special Investigation Team) విచారణ జరుగుతుందన్నారు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ సహా నిందితుల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. మరి రేపు మరోసారి వాదనలు విననున్న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case