జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్‌కు దక్కినా... పైచేయి మాత్రం బీజేపీదే అయ్యింది. గతంతో పోలిస్తే 45 సీట్లు ఎక్కువగా సాధించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. గతంలో టీఆర్ఎస్ సాధించిన అనేక స్థానాలను.. ఈసారి బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. సీట్లు మాత్రమే కాదు.. ఓట్ల విషయంలోనూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్ల శాతం బీజేపీ సొంతమైంది. ఒక దశలో టీఆర్ఎస్‌తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డ బీజేపీ.. టీఆర్ఎస్ కంటే కేవలం ఎనిమిది సీట్లు మాత్రం తక్కువ సాధించి రెండో స్థానంలో నిలిచింది.
నగరంలోని అనేక ప్రాంతాల్లో సత్తా చాటిన బీజేపీ... ఆంధ్రా ప్రాంత సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రం పెద్దగా సీట్లు సాధించలేదు. ఒకవేళ ఇక్కడ కూడా బీజేపీకి ఎక్కువగా సీట్లు వచ్చి ఉంటే.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను మించిన స్థాయిలో బీజేపీ సీట్లు సాధించి ఉండేది. దీంతో అసలు ఈ ప్రాంత ప్రజలు బీజేపీ వైపు ఎందుకు చూడలేదనే చర్చ మొదలైంది. అయితే ఏపీ ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంత ఓటర్లలో కొందరు టీడీపీకి అనుకూలమైన వాళ్లు కాగా.. మరికొందరు వైసీపీకి అనుకూలమైన ఓటర్లు ఉంటారు.
వీరిలో టీడీపీకి అనుకూలంగా ఉండే ఓటర్లు బీజేపీకి ఓటు వేయకపోవడానికి అమరావతి అంశమే ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో అమరావతి విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు టీడీపీకి అనుకూలంగా ఉండే ఓటర్లకు నచ్చకపోవడం వల్లే.. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్‌కు ఓటు వేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. సెటిలర్లలో మరో వర్గమైన వైసీపీ అనుకూల ఓటర్లు బీజేపీని ఆదరించకపోవడానికి మరో కారణం ఉందనే వాదన వినిపిస్తోంది.
ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తే.. ఆ తరువాత ఆ పార్టీ ఏపీపై ఫోకస్ పెడుతుందని.. అది ఏపీలో అధికార వైసీపీకి ఇబ్బందిగా మారుతుందని వైసీపీ అనుకూల ఓటర్లు భావించి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే వైసీపీ అనుకూల ఓటర్లు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించిన కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేసిన సీమాంధ్ర సెటిలర్లు.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని కాదని టీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు రావడానికి దోహదపడటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC Election Result, Tdp, Telangana, Ysrcp