సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, షాపులను ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్లు దాడులు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గాల్లోకి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్స్ ఆందోళనకారులను తగిలినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు. మరికొందరు నిరసనకారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Secunderabad: మంటల్లో కాలిపోతున్న రైళ్లు.. సికింద్రాబాద్ స్టేషన్‌లో భయానక దృశ్యాలు
సికింద్రాబాద్ స్టేషన్‌లో హింసాత్మక (Secunderabad Violence) ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను స్టేషన్‌కు తరలించారు. అటు ఆందోళనకారులు కూడా పెద్ద ఎత్తున అక్కడే ఉన్నారు. పట్టాలపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారిలో చాలా మంది చేతిలో రాళ్లు ఉన్నాయి. పోలీసులు ముందుకు వస్తే.. వెంటనే రాళ్లు రువ్వుతున్నారు. ఈ క్రమంలోనే వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఐతే కాల్పుల్లో ఒకరు మరణించడంతో.. పోలీసులు కాస్త వెనక్కి తగ్గారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మొత్తం మూడు రైళ్లు తగలబడ్డాయి. దర్భంగా, ఈస్ట్‌కోస్ట్, అజంతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంటల్లో కాలిపోయాయి. స్టేషన్‌లో ఉన్న షాపులు, ఇతర ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేయడంతో.. కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిజాం కాలంలో నిర్మించారు. ఈ స్టేషన్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ స్థాయిలో ఎప్పుడూ విధ్వంసం జరగలేదు. స్టేషన్ పూర్తిగా కళతప్పిపోయింది. ధ్వంసమైన షాపులు.. పగిలిపోయిన అద్దాలు... కాలిపోయిన రైళ్లతో.. స్టేషన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది.
Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోరం.. గుజరాత్ యువతిపై అత్యాచారం.. పబ్‌లో పార్టీ తర్వాత..
వాస్తవానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముట్టడికి సంబంధించి నిన్ననే NSUI ప్రకటన చేసింది. ఆందోళనకారులు స్టేషన్ పరిసరాల్లోకి వస్తే.. అడ్డుకుందామని పోలీసులు భావించారు. కానీ అనూహ్యంగా వేలాది మంది ఎలా వచ్చారన్నది అర్థం కావడం లేదు. ముందస్తు ప్రణాళికతో.. ఆందోళనకారులంతా ఎంఎంటీఎస్ రైళ్లలో స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం స్టేషన్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. ఐతే ఈ ఘటనలతో NSUIతో సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. ఆందోళనకారుల్లో తమ యూనియన్‌కు చెందిన విద్యార్థులెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Protest, Agnipath Scheme, Secunderabad, Secunderabad railway station, Telangana