తెలంగాణలో సంచలనం రేపిన సీఎం కేసీఆర్ బంధువుల కేసు కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బిగ్ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. భూమా అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతోందని.. బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఐతే అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా గట్టిగా వాదించారు. అంతేకాదు ఆమెపై అదనపు సెక్షన్లు నమోదు చేసి మెమో దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. జీవిత కాలం శిక్షపడే కేసులు తమ పరిధిలోకి రావని.. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అనంతరం బెయిల్ పిటిషన్‌ను తిప్పి పంపింది.
ఈ నేపథ్యంలో బెయిల్ కోసం నాంపల్లి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు భూమా అఖిలప్రియ. ఐతే ''ఇది జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసు'' అని సికింద్రాబాద్ కోర్టు వ్యాఖ్యానించడంతో.. భూమా అఖిల ప్రియకు జీవిత ఖైదు తప్పదా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు అఖిలప్రియ. ఆమెకు బెయిల్ ఇస్తే.. నిందితులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు వాదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టుకు ఆమెకు బెయిల్ నిరాకరించింది. అనంతరం మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు భూమా అఖిలప్రియ. ఐనప్పటికీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
జనవరి 5న హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావు సోదరులను భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. ఈ కేసులో జనవరి 6న భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి రిమాండ్‌లోనే ఉన్నారు. కోర్టు 3 రోజుల పోలిస్ కస్టడీకి అప్పగించడంతో.. మూడు రోజుల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. కిడ్నాప్ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. కిడ్నాప్‌కు ఎలా స్కెచ్ వేశారు? కిడ్నాప్‌లో పాల్గొన్న వారెవరు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? నిందితులు ఎక్కడ ఉన్నారన్న దానిపై కూపీ లాగారు. అఖిలప్రియ ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఇప్పటి వరకు అఖిలప్రియతో కలిపి మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, జగన్విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ ఏ1గా ఉన్నారు. ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శీను ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు తేల్చారు. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లోనే కిడ్నాప్‌కు స్కెచ్ వేసినట్టు వెల్లడించారు. ఈ నెల 2, 4 తేదీల్లో అఖిలప్రియ, భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శ్రీను కిడ్నాప్‌కు ప్లాన్ రూపొందించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు ఫ్యామిలీకి, అఖిలప్రియ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్ రావు సోదరులను అఖిల్ ప్రియ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.