తెలంగాణ.. నిర్మల్ జిల్లా.. భైంసాలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అది ఇవాళ, రేపు అమల్లో ఉంటుంది. ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. రెవెన్యూ అధికారులు 144 సెక్షన్ అమలైందని చెబుతుంటే.. స్థానిక పోలీసులు మాత్రం అమల్లో లేదంటున్నారు. మరోవైపు పాదయాత్రకు అనుమతి ఇప్పించాలని కోరుతూ.. బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో పాదయాత్ర ఉంటుందా అని ప్రశ్నించిన కోర్టు.. దీనిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కోర్టు అనుమతి ఇస్తే.. పాదయాత్ర చెయ్యాలని బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఇవాళ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతోపాటూ.. నిన్న ఆయన కరీంనగర్ నుంచి భైంసాకు వెళ్తుండగా.. కోరుట్ల సమీపంలో పోలీసులు అడ్డుకొని.. బలవంతంగా కరీంనగర్‌కు తరలించడంతో.. ఈ అంశం రాజకీయంగా రచ్చ రేపుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ నిర్మల్ జిల్లా.. భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై మండిపడిన బండి సంజయ్ పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఐదో విడత ఎలా?
ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుంచి కరీంనగర్ (Karimnagar) వరకు తలపెట్టారు. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా.. డిసెంబర్ 16,17న కరీంనగర్లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ (Karimnagar) లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది. మరి దీనికి అనుమతి వస్తుందా.. రాదా అన్నది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.