Home /News /telangana /

SCHOOLS WILL BE REOPENED IN TELANGANA FROM FEBRUARY 1ST SAYS CM KCR SK

Telangana: స్కూల్స్ రీ ఓపెనింగ్ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

    కరోనా మహమ్మారి ప్రభావంతో మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభమమ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్కూళ్ల పున: ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి, ఆపై తరగతులను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆదేశించారు. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. సోమవారం మంత్రులు, కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్ల పున: ప్రారంభంతో పాటు పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

    ‘‘ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలి. ఈ లోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులు అవుతున్నది కాబట్టి అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరి చూసుకోవాలి. మొత్తంగా ఈ నెల 25 లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    ఇక రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటు కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Schools reopening, Telangana, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు