Kamareddy Youth Micro Arts | బియ్యపు గింజలు, సుద్దముక్కలు, సబ్బు బిళ్ళలు, పెన్సిల్ కాదేదీ కళకు అనర్హం అన్నట్టు ఓ యువకుడు తన సూక్ష్మ కళతో అధ్బుత చిత్రాలు గీస్తున్నాడు. ఓ వైపు సూక్ష్మ కళతో మరోవైపు చిత్రలేఖనంలో తన ప్రతిభను చాటుతున్నాడు. వినాయక చిత్రాలు అందరిని ఆకర్శిస్తున్నాయి. డ్రాయింగ్ లో సైతం పలువురి మన్ననలు పొందుతున్నాడు కామారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ సరిచంద్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం తాండాకు చెందిన బుజ్జిబాయి, పరుశురాం దంపతుల కుమారుడు బానోత్ సరిచంద్. వ్యవసాయమే వీరి జీవనాదారం. చిన్నతనం నుంచి సరిచంద్ కు చిన్న వస్తువులపై బొమ్మలు గీయడం పై ఆసక్తి ఉండేది. దీంతో ఈ కళపై మక్కువ పెంచుకున్నాడు. సరిచంద్ 5వ తరగతి వరకు తాండాలో, 6 ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు. బాన్స్ వాడలో ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేశాడు. సరిచంద్ లోని ప్రతిభను గుర్తించారు తల్లిదండ్రులు. ప్రోత్సాహంతో ఆర్ట్స్ అండ్ మైక్రో ఆర్ట్స్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేశాడు. ఇందులో డ్రాయింగ్ హయ్యర్ విభాగంలో జిల్లా టాపర్ గా నిలిచాడు. సుద్ధ ముక్క, పెన్సిల్ లిడ్, సబ్బు బిళ్ల, క్యాండిల్, బియ్యపు గింజ, పప్పు ముక్క, పచ్చని ఆకులు తదితర వాటిపై గణపతి, గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రధాని మోదీ, ప్రజాకవి కాళోజీ, వివేకానంద, భగత్ సింగ్, అబ్దుల్ కలాం, ఝాన్సీ లక్ష్మిబాయి, వరల్డ్ కప్, గిటార్, బ్యాట్, వినాయకుడి ప్రతిమ, ఇంటర్నేషనల్ డెమోక్రసీ లోగో, మైక్, ఓటర్ లోగో, న్యూ ఇయర్, రిపబ్లిక్ డే అక్షరాలు, జాతీయ చిహ్నం , జాతీయ జెండా, భారతదేశ చిత్రపటం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, న్యూస్18లోగో తదితర రూపాల తీర్చిదిద్దాడు.
కేవలం సూక్ష్మ కళలతోనే కాకుండా చిత్రలేఖనంలో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. గిరిజనుల ఆరాధ్య దేవుడు సేవాలాల్ మాహరాజ్ చిత్రం, ఆయోధ్య రామమందిరం, పల్లెటూరు, గ్రామీణ మహిళలు, బాతు, హంస, శ్రీకృష్ణుడు, భారతదేశం కరోనా విజృంభణ తదితర చిత్రాలు వేసి అందరిని అబ్బుర పరుస్తున్నాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి మైక్రో ఆర్ట్స్ పై ఆసక్తి ఉంది. మైక్రో ఆర్ట్స్ పై అవగాహన ఏర్పర్చుకుని పలు చిత్రాలు గీశాను. వాటికి మంచి స్పందన వచ్చింది. గిన్నిస్ బుక్ లో స్థానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడమే నా లక్ష్యం’ అని న్యూస్18తో అన్నాడు సరిచంద్.