(K.Lenin,News18,Adilabad)
నిర్మల్ జిల్లా (Nirmal District) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి శుక్రవారం కావడంతో శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), మహారాష్ట్ర(Maharashtra) నుండి భారీగా తరలి వచ్చారు. వేకువజామున ఆలయ అర్చకులు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, అలంకరణ, హారతి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అయితే చదువుల తల్లి, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీ అమ్మవారి దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే కనిపిస్తాయి. అందులో ఒకటి కాశ్మీరులో, రెండవది నిర్మల్ జిల్లా బాసరలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం.
అమ్మవారు త్రిశక్తి రూపంలో మహాలక్ష్మి, మహాకాళి సమేతులై భక్తులకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అని అంటున్నారు భక్తులు. కాగా గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం సమీపంలోని శ్రీ సూర్యేశ్వర శివాలయంలో ఆలయ అర్చకులు, భక్తులు అభిషేకం, అర్చన, బిల్వార్చన, విశేష పూజలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శివాలయం శివనామ స్మరణతో మార్మోగింది. అనంతరం సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షర స్వీకార పూజలు చేయించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
అసలు దీని విశేశాలు ఏంటంటే.. బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.
ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఇలా అక్షరాభ్యాసం చేయిస్తే.. భవిష్యత్తులో చదువు బాగా వస్తుందనే నమ్మకం. అందుకే ఇలా సరస్వతి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేయిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.