Home /News /telangana /

SANKRANTI 2021 WHAT IS IMPORTANCE OF KITES IN PONGAL HERE ARE ALL DETAILS SK

Sankranti Kites: పతంగి కహానీ.. జీబ్యా, లంగోట్, పచ్చీస్, టోపీదార్.. ఇవన్నీ గాలిపటాలే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sankrathi 2021 Kites Importance: మాంజాలలో కూడా రకాలున్నాయి.. మోతీయా, గాజర్‌, గంధక్‌, ఫెరోజా, టీలా, కాశ్మీ, హరా, కాలా, అండేకా, రెడ్‌ రోజ్‌ ఇలా చాలా రకాలుంటాయి. గంధం మాంజా ఎక్కువగా డీల్‌కే ఉపయోగిస్తారు.

  (రచయిత:  గోవ‌ర్ధ‌నం కిర‌ణ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ )

  నాకు తెలిసిన సంక్రాంతి అంటే చకినాలు, అర్షలు, పతంగులే.....తెలంగాణ అంతా కూడా దాదాపుగా ఇదే కనిపిస్తుంది. పతంగులు ఎగరేయడంలో పిల్లలతోపాటు పెద్దలు కూడా జతకూడేవారు. డిసెంబర్‌ నెలలో మొదలయ్యే పతంగుల ఆట జనవరి చివరి దాకా కొనసాగేది. చిన్నప్పటి మా ఆటల లిస్టులో పతంగులు, సీసం గోలీలు, జిల్లిగోన(గిల్లిదండు), బొంగరాలు, పిచ్చిబంతి వంటివే ప్రధానమైనవి.
  ఇందులో పతంగులు మాత్రం సీజనల్‌ ఆట. మా గల్లిలో ఉన్న ఇళ్లలో ఎక్కువగా పెంకుటిల్లే ఉండేవి. కొన్ని చౌడు కట్టిన డాబా ఇళ్లు ఉన్నాపైకి ఎక్కడానికి మెట్టు ఉండేవి కావు. దీంతో పతంగులు ఎగరేయాలంటే రోడ్లే దిక్కు. వీధిలో చెట్లు ఉండడంతో పైకి ఎగిరి ఎగరకముందే వాటికి చిక్కుకునేది. మిగిలిన ఆటల్లో అంతో ఇంతో ప్రావీణ్యం వచ్చినా పతంగులు ఎగరేయడంలో మాత్రం అమెచ్యూర్‌ స్టేజ్‌ ఎప్పుడూ దాటలేదు.

  గ్రౌండ్‌ వెళ్లి ఎగరేసే అంత వయస్సు లేదుకాబట్టి ఇంట్లో పంపించకపోయేవాళ్లు. ఈలోపు ఏ జాలిమ్‌ లోషన్ కూడా వదిలించలేని స్థాయిలో క్రికెట్‌ అంటుకుంది. అంతే మిగిలిన ఆటలన్నీ పక్కకు పోయి యుక్తవయస్సు వచ్చేవరకు కూడా క్రికెట్‌ ఒక్కటే కొనసాగింది. అయినా పతంగులు ఎగరేయ రాకపోవడం అనే అసంతృప్తి నాలో గుడూకట్టుపోయింది. అందుకని పతంగులు ఎగరేసేవారు నాకు అద్భుతమైన ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. నా చుట్టపక్కల, లేకుంటే ఫ్రెండ్స్‌ ఎవరైన పతంగి ఎగరేస్తుంటే నాకు రాకపోయినా వాళ్లతో కలిసి ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడతాను.

  ఇంటర్లో నా అద్భుతమైన మార్కులకు చూసి నల్లగొండలోని ఏకైక డిగ్రీ కాలేజీ నీకు సీటు ఇవ్వలేం హైదరాబాద్‌ పొమ్మంది. అలా డిగ్రీ చదువుకోవడానికి పట్నం చేరి న్యూ నల్లకుంటలో రూమ్‌ తీసుకుని ఉండేవాళ్లం. నేను, మా అన్నయ్య, క‌జిన్స్‌ అందరం ఒక దగ్గర ఉండేవాళ్లం. మా రూమ్‌ ఉన్న ప్రాంతం నల్లకుంటలోని స్లమ్‌ ఏరియాల్లో ఒకటి. దిగువ మధ్య తరగతి నుంచి మధ్య తరగతికి ఎదుగుతున్న కుటుంబాలు ఉండేవి అక్కడ. 40 గజాల్లో కట్టిన ఇంటిలో రెండస్తుల్లో ఉండేవాళ్లం. ఇంటి ఓనర్‌ మల్లయ్య ఎలకి్ట్రసిటీ డిపార్ట్‌మెంట్‌లో స్తంబాలు వేయడం, ట్రాన్సఫార్మర్లు బిగించడం వంటి చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవాడు. చేతికింద ఎప్పుడూ ఐదారుగురు పిల్లలు ఉండేవాళ్లు. వారంతా మరో అంతస్తులో ఉండేవాళ్లు. ఓనర్‌ మేనల్లుడు సత్తి పతంగులు ఎగరేయడంలో ప్రొఫెషనల్‌. సంక్రాంతి వచ్చిందంటే దూల్‌పేటకి పోయి పెద్దపెద్ద చ‌ర్ఖాలు, మాంజా, పతంగులు తెచ్చేవాడు. అవి ఎగరేసే టైమ్‌కి ఆ గల్లిలో యూత్‌ అంత మా బిల్డింగ్‌పైకి చేరేవారు.

  చిన్న బిల్డింగ్‌పై నుంచే ఐదారు పతంగులు పైకి లేచేవి. అక్కడ హడావిడి అంతా ఒకరేంజ్‌లో ఉండేది. వీటిని చూసి ఎంజాయ్‌ చేయడానికి దాదాపుగా ఆ పండక్కి నల్లగొండ పోకపోయేవాళ్లం. పొద్దున్నే పక్కనే ఉన్న మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి పోయి లంచ్‌ చేసి మద్యాహ్నం మా బిల్డింగ్‌పైకి చేరే వాళ్లం. టెర్రస్‌ అంత వైబ్రెంట్‌గా ఉండేది.

  ఒకపక్క పతంగులు ఎగరేస్తూనే మరోపక్క పెద్ద పెద్ద లౌడ్‌ స్పీకర్లు, మైక్‌సెట్టు పెట్టి హిందీపాటలు మోగించేవాళ్లు. ఎవడి పతంగి కాట్‌ అయినా మైకుల్లో అరిచే అరుపులు ఠారెత్తిపోయేవి. అవతలి వాడు పెద్ద తురుం అయితే తప్ప మా సత్తి పతంగి కట్‌ అయ్యేది కాదు. రకరకాల డిజైన్లు, లైట్లు పెట్టి పతంగులను ఎగరేసేవాడు. పదుల సంఖ్యలో అవతలి పతంగులను కాట్‌ చేసేవాడు. దాదాపుగా చీకటి పడేవరకు ఇది కొనసాగేది. పదేళ్లు సంక్రాంతి పతంగులను ఎంజాయ్‌ చేశాం. మా పిల్లలు కొంచెం పెద్దయిన తరువాత పతంగులు ఎగరేసే ప్రయత్నం మొదలుపెట్టినా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విజయం సాధించలేక పోయా. ఇప్పుడు నాతోపాటు వాళ్లను కూడా పతంగులు ఎగరేసే ప్లేస్‌లకు తీసుకెళుతున్నా...హైదరాబాద్‌లో పతంగులు ఎగరేసేప్పుడు వాడే పదాలు డిఫరెంట్‌గా ఉండేవి. మొదట్లో కొంచెం అర్థం కాకపోయేది. పతంగులు ఎగరేయడానికి రాకపోయినా భాషమాత్రం పట్టుబడింది. ధనుర్మాసంలో వీచే తూర్పు గాలిని రైతులు తూర్పార పట్టడానికి ఉపయోగిస్తే యూత్‌ మాత్రం పతంగులు ఎగరేయడానికి ఉపయోగిస్తారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌, కరాచి, లాహోర్‌లలో కూడా గాలిపటాలు గాల్లో ఎగురుతుంటాయి.

  పతంగుల మధ్య రసవత్తరమైన పోరు సాగుతుంది. ఒక పతంగీని మరో పతంగీ కోసే ప్రక్రియకు పేంచ్‌ అని పేరు.. పేంచ్‌ పడిందంటే పతంగుల మధ్య పోరు మొదలయ్యిందన్నమాటే! ఎవరు ఎన్ని పతంగులు కాట్‌ చేేస్త అంత తోపు తురుమ్‌. అందుకే పేంచ్‌ కోసం మంచి మాంజాను వాడతారు. గాజు పొడి అద్దిన దారాన్ని మాంజా అంటారు. రెండు పతంగులు ముడిపడిన తర్వాత దారం పదునును బట్టి ఏదో ఒకటి వెంటనే తెగిపోతుంది. పతంగులు, మంజాల తయారీలో గుల్జార్‌హౌజ్‌, పత్తర్‌గట్టి, మంగళ్‌హాట్‌ ఫేమస్‌. గుల్జార్‌హౌజ్‌లో ఉన్న జ్ఞానేశ్వర్‌ మాంజాకు, సికింద్రాబాద్‌లోని కింగ్స్‌వేలో ఉన్న పెంటయ్య మాంజాకు హైదరాబాద్‌లో అప్పట్లో పెద్ద క్రేజ్‌! అక్కడ్నుంచి మాంజా కొనుక్కుని వేస్త అదో గొప్పగా ఫీలయ్యేవారు. ఇక్కడ తయారయ్యే పతంగ్‌లు చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి అయ్యేవి.


  మాంజా తయారీలో మెత్తటి గాజు పొడి, కలబంద, అన్నం ముద్ద, కోడిగుడ్డు, బెండకాయ, కలర్‌ కోసం రంగును వాడతారు. సన్నటి దారంపై ఇవన్నీ కలగలిపిన ముద్దను పూేస్త మాంజా తయారవుతుంది. దీన్ని మాంజా సుతాయించడం అంటారు. మాంజాను గిటి లెక్కన కొలుస్తారు..ఒక్కో గిటి 45 మీటర్లు ఉంటుంది. ఇది కాకుండా లచ్చాల లెక్క కూడా ఉంటుంది. లచ్చా అంటే బొటన వేలి నుంచి దారాన్ని చిటికిన వేలుకు చుట్టి మళ్లీ బొటనవేలి వరకు వెళ్లడం. ఎనిమిది అంకె షేపులో దారాన్ని చుడతారు.

  మాంజాలలో కూడా రకాలున్నాయి.. మోతీయా, గాజర్‌, గంధక్‌, ఫెరోజా, టీలా, కాశ్మీ, హరా, కాలా, అండేకా, రెడ్‌ రోజ్‌ ఇలా చాలా రకాలుంటాయి. గంధం మాంజా ఎక్కువగా డీల్‌కే ఉపయోగిస్తారు. ఒక్కోసారి పతంగ్‌ కాటవ్వడానికి చాలా సేపు పడుతుంది. ఇలాంటి వాటిని మొండి పేంచ్‌లంటారు. పేంచ్‌ పడ్డాక దారాన్ని వదులుతూ, లాగుతూ, మళ్లీ వదులుతూ... ఇలా చేయడాన్ని కీంచ్‌ అంటారు. దారాన్ని బలంగా లాగడమన్నమాట. అలా కాకుండా దారాన్ని నెమ్మదిగా వదులుతూ వెళితే డీల్‌ అంటారు. కొద్దిగా కరుకుగా ఉన్న మాంజాతో అయితే కీంచ్‌ బెటర్‌...! కొద్దిగా సాఫ్ట్‌గా ఉన్న మాంజాతో అయితే డీల్‌ ఉత్తమం! అవతలివారి పతంగిని కోసినప్పుడు ఆనందంతో అఫా, సఫా అని అరుస్తుంటారు కొందరు. క్యా కాటే అంటూ అరుస్తారు కూడా!

  ఎక్కడో ఉన్న పతంగీకి పేంచ్‌ వేయాలంటే మన పతంగీని అక్కడి వరకు తీసుకెళ్లాలి. అప్పుడు పతంగీని రోక్‌ కొట్టించి, అంటే ఓ వైపుకు వంచి నెమ్మదిగా అక్కడి వరకు తీసుకెళ్లగలగాలి. ఇది కూడా టాలెంట్‌తో కూడిన విద్యే! యుద్థంలో కొన్ని నియమాలు ఉన్నట్టుగానే పతంగుల పోరులో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. రెండు గాలిపటాలు తలపడుతున్నప్పుడు మూడో పతంగీ తలదూర్చకూడదు. అలాగే పేంచ్‌ మాంజాలోనే వేయాలి తప్ప సాదా దారంలో వేయకూడదు. పేంచ్‌ మధ్యలో అవతలివారి పతంగిని మనం బలవంతగా లాగేసుకుంటే దాన్ని అత్తంబాజీ అంటారు.. సాధారణంగా ఇలాంటివి మొండి పేంచ్‌లలో ఎదురవుతుంటాయి.. ఎంతకీ పోరు ముగీయకపోతే విసుగుతో గబగబ పతంగిని లాగేసుకుంటాం. అలాంటప్పుడు అవతలివారి పతంగి కూడా మన పతంగితో వచ్చేస్తుంది.. అత్తంబాజీ వల్ల ఒక్కోసారి గొడవలు కూడా అవుతుంటాయి.

  kite festival, sankranti festival, Indian Aircraft Act of 1934, kite flying license, kite manza, manza making, killer manza, how to make manza, kite making, how to make manza, pongal 2021, sankranti 2021, సంక్రాంతి పతంగులు, గాలి పటం, పతంగి మాంజా, గాలిపటం మాంజా, సంక్రాంతి, క్రైమ్ న్యూస్
  ప్రతీకాత్మక చిత్రం


  అలాగే పతంగీ తేలిపోయి గాల్లో ఎగురుకుంటూ పోతున్నప్పుడు ఆ పతంగీని మన పతంగీ ఆధీనంలో తెచ్చుకుంటే దాన్ని లప్టాయించడం అంటారు. కొందరు లుప్టాయించడమని కూడా అంటారు. అన్నట్టు ఒక్కోసారి పతంగి మన చేతి దగ్గర నుంచి తెగీపోతుంది.. అలాంటప్పుడు దాన్ని ఉక్డాయించిందని అంటారు.. అందుకే దారానికి ముళ్లు జాగ్రత్తగా వేయాలి.. పతంగులు ఎగరేేసేటప్పుడు ఒక్కోసారి అవి చెట్లకు, స్తంభాలకు తట్టుకుంటాయి. కర్రకందితే తీసుకోవచ్చు. లేకపోతే మాత్రం దారానికి కొద్దిగా బరువున్న రాయిని కట్టి ఆ రాయిని పతంగి దారంపై విసిరి లాగుతారు. రాయిని కట్టిన దారాన్ని లండోరి అంటారు.

  పతంగుల సీజన్‌లో.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు మేడ మీద గోందు (బంక), గోందు లేకపోతే అన్నం, రంగు కాగితం కంపల్సరీ. ఇప్పడంటే ప్లాస్టిక్‌ పతంగులు వచ్చాయి. గతంలో పేపర్‌ పతంగులే ఉండేవి. అందుకే పేపర్‌తో చినిగిపోయిన పతంగీని అంటిస్తుంటారు. పతంగీకి ఉన్న నిలువుబద్ద విరిగీపోతే దానికి బీడి సపోర్ట్‌గా పెట్టేవారు! పతంగులకు జోడీగా డాబాల మీద మైక్‌ సెట్లు సిద్థం. ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎవరి పతంగీని ఎవరు కోసారు? ఆవన్నీ మైకుల్లో రన్నింగ్‌ కామెంటరీ జరుగుతాయి. పతంగుల్లో బోలెడన్ని రకాలున్నాయి. కడీకంప్‌, గోల్‌ కంప్‌ , అద్దా, పౌండ్‌, ఆదాపౌండ్‌, డోరాడార్‌, జీబ్యా, లంగోట్‌, లైంగా లంగోట్‌, జీబ్యా లంగోట్‌, జీబ్యా లైంగా లంగోట్‌, గుడ్డీ లంగోట్‌, గుడ్లందార్‌, నామందార్‌, పట్టిదార్‌, టోపీదార్‌, నామమ్‌దార్‌, రోటీదార్‌, షీషల్‌దార్‌, చొప్పన్‌, పచ్‌పన్‌, అదారోటీ, పచ్చీస్‌, గీల్లోరా. ఇవన్నీ పతంగుల పేర్లే!

  Kites, Pongal, Woman, Fall, Telangana, Telangana News, Building, Hospital, Sankratiri, accident, యువతి, గాలిపటం, పతంగులు, పతంగి, భవనం నుంచి, ప్రమాదం
  ప్రతీకాత్మక చిత్రం


  కడీకంప్‌ నిటారుగా ఎగీరితే, గోల్‌కాంప్‌ ఎగురవేేస వారి ఆధీనంలో వుండి ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. గోల్‌కంప్‌ చాలా ఫెరోషియస్‌గా వుంటుంది. కడీకంప్‌ పతంగి పాపం సాధుస్వభావి.. దాన్ని ఎగరేసిన తర్వాత మనం దారాన్ని దేనికో ఓదానికి కట్టేసి చక్కగా లంచ్‌ చేసి రావచ్చు. దాని జోలికి రాకపోతే అప్పటి వరకు అది గాల్లోనే ఎగురుతుంటుంది.. పౌండ్‌ పతంగి చాలా బరువు.. దీన్ని ఎగరేయడం పిల్లలవల్ల కాదు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన పతంగీని దులపనియా పతంగి అంటారు. ఇప్పుడీ పతంగులు లేవు. పేర్లూ లేవు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. అన్నట్టు పతంగులకు కన్నాలు కట్టడం కూడా ఓ ఆర్టే. ఆ కళ అందరికీ రాదు. ఎంతో రాటు తేలితే కానీ ఆ విద్య అబ్బదు. పతంగీ ఎగరాలన్నా, అది మనం చెప్పినట్టు వినాలన్నా కన్నాలే ఆధారం. అవి సరిగ్గా కట్టకుంటే గాలి ఎంత బాగా వీచినా పతంగీ ఎగరదు. మొండికేస్తుంది. కొత్తగా పతంగులు ఎగరేేసవారు బెత్తల లెక్కలు వేసుకుంటూ కన్నాలు కడతారు.. ఇక పతంగులను ఎగరేేసందుకు ముఖ్యమైన మరో వస్తువు చర్ఖా! ఇందులో దారం చుట్టడం కూడా ఓ కళే! చర్ఖాకు ముందు కాగితం చుడతారు.. ఆపై సాదా దారాన్ని చుడతారు.. అప్పట్లో మధుర కోట్స్‌, మోడత్రెడ్‌ దారం చాలా ఫేమస్‌.. 50 మీటర్లు, వంద మీటర్ల రీల్‌ దొరికేది.. దీన్ని కెయిట్‌ దారం అనేవారు!

  పతంగుల సమరాంగణంలో విజయపు ఘనత పతంగి ఎగరేేసవాడికి ఎంత ఉంటుందో . చర్ఖా పట్టుకునేవాడికి కూడా అంతే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప‌తంగి ఎగ‌రేసేవాడు ర‌థి అయితే, చర్ఖా పట్టుకున్నసారథి అన్నమాట! పేంచ్‌ సమయంలో చర్ఖా పట్టుకున్నవాడు ఏ మాత్రం తత్తరపాటుపడినా పతంగీ కాట్‌ అవుతుంది.. చాలా అలెర్ట్‌గా ఉండాలి.. మన పతంగీ కాట్‌ అయినప్పుడు దారాన్ని చాలా స్పీడ్‌గా చుట్టాలి. పతంగీ ఎగరేేసే వాళ్లు చేతి వేళ్లకు టేపును చుట్టుకోవడమో, కుట్టు మిషన్‌లో ఉండే బాబిన్‌ను వేలికి తొడుక్కోవడమో చేస్తారు. లేకపోతే వేళ్లను మాంజా కోసేస్తుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Kite festival, Kites, Pongal, Sankranti 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు