news18-telugu
Updated: November 15, 2020, 11:41 PM IST
తంగేడు పూలతో గిరిజన అమ్మాయిలు
తెలంగాణలో బతుకమ్మ పండగ ఎప్పుడో వెళ్లిపోయింది. దసరా ముందు వరకు తెలంగాణ అంతటా బతుకమ్మల సందడి నెలకొంది. ఆటపాటలతో తెలంగాణ ఆడపడచులు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కానీ సంగారెడ్డిలోని పలు గిరిజన తండాల్లో మాత్రం దీపావళి వేల బతుకమ్మల ఆటపాటలు కనిపించాయి. నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాల పరిధిలోని గిరిజనులు దీపావళి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకున్నారు. ఈ ప్రాంతాల్లో అత్యధిక గిరిజన తండాలు ఉన్నాయి. అక్కడి గిరిజన యువతులు కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు.
సాధారణంగా దీపావళి రోజున అందరూ లక్ష్మీ పూజ చేసి.. ఇంట్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. పిండి వంటలు, తీపి పదార్థాలను వండుకుంటారు. బంధు మిత్రులకు స్వీట్లు, కానుకలను అందజేస్తారు. సాయంత్రం వేళ ఇంటిల్లి పాది కలిసి దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చుతారు. కానీ సంగారెడ్డి పరిధిలోని తండాల ప్రజలు మాత్రం కాస్త విభిన్నంగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగతో సుమారు 190 తండాల్లో మొత్తం సందడిగా మారింది.

గిరిజన తండాలోని పెళ్లి కాని ఆడపడుచులు ఉదయాన్నే స్నానమాచరించి.. అడవిలోకి వెళ్లి రంగురంగుల పూలను కోసుకొస్తారు. అనంతరం భవాని మాత దగ్గరకు వెళ్లి .. అందమైన బతుకమ్మలను పేర్చుతారు. ప్రతి ఇంటి వాకిట్లో బతుకమ్మలను పెట్టి గిరిజన భాషలో పాటలు పాడుతూ, ఆటలు అడుతారు. ప్రతీ ఇంటికి రాత్రి సమయంలో దీపాలు తీసుకొని వెళ్లి.. తల్లి దండ్రుల దగ్గరకు దీవెనలు తీసుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతో కొంత డబ్బును పెళ్లి కాని ఆడపడుచులకు ఇస్తారు. పెళ్లి గాని ఆడపడుచులు మంచి భర్త దొరకాలని దీపావళి పండుగ రోజున ధనలక్ష్మికి మొక్కుతారు. ఈ ఆచారం తరతరాల నుండి వస్తుందని తండాలోని గిరిజన యువతులు అంటున్నారు. ఆ సంప్రదాయాన్నే తామూ పాటిస్తున్నామని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 15, 2020, 5:23 PM IST