(K.Veeranna,News18,Medak)
వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త వెహికల్ కొంటే చాలు..లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనంలో ఇరవై శాతం డబ్బులు చెల్లించేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని ఆర్టీఏ(RTA)పరిధిలోని యూనిట్ కార్యాలయాలకు కాసుల వర్షం కురిపించింది. కేవలం పది ఫ్యాన్సీ నెంబర్ల(Fancy numbers)ను ఆన్లైన్ వేలం(Auction)లో పెట్టడంతో వాహనదారులు పోటీ పడి మరీ అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లను దక్కించకున్నారని అధికారులు వెల్లడించారు.
పెరుగుతున్న ఫ్యాన్సీ నంబర్ల మోజు..
కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు దాని నెంబర్ ఫ్యాన్సీగా ఉండాలని ఆశ పడే వాళ్లు తక్కువేం కాదు. ముఖ్యంగా లక్కీ నెంబర్ కోసం కొందరు, పుట్టిన రోజు డేట్ నెంబర్‌తో కొందరు, ఫోన్ నెంబర్ సెంటిమెంట్‌తో మరికొందరు ఇలా వేర్వేరు సెంటిమెంట్‌తో ఫ్యాన్సీ నెంబర్ల కోసం ట్రై చేస్తుంటారు. సంగారెడ్డి జిల్లా ఆర్టీఏ పరిధిలోని సంగారెడ్డి, జహిరాబాద్,పటాన్చెరు ఆర్టీఏ యూనిట్ కార్యాలయాలకు ఆదాయం లక్షల్లో వచ్చింది. 10 కొత్త ఫ్యాన్సీ నంబర్లను సోమవారం ఆన్లైన్లో పెడితే టీఎస్ 15ఎఫ్ఎ 9999 నంబరును ఆన్ వేలంలో రూ. 3లక్షల 11వేల 004 రూపాయలకు ఓ వాహనదారుడు దక్కించుకున్నాడు.
10నంబర్లకు ఏడున్నర లక్షలు ..
ముందస్తుగా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తుల ద్వారానే రవాణాశాఖకు ఒక లక్ష 55వేలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక పది ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేయగా 7లక్షల 44వేల741 రూపాయలు వచ్చినట్లుగా ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టిఏ డిప్యూటీ కమిషనర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు.
లక్షల్లో ఆదాయం..
ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునే వాహనదారులు ఎప్పటికప్పుడు ఆర్టీఏ వెబ్‌సైట్‌ని ఫాలో అవుతూ ..నెలల తరబడి వెయిట్ చేసి మరీ తమకు కావాల్సిన నంబర్లను దక్కించుకుంటున్నారు. ఇందుకోసం వేలు కాదు లక్షలు చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. ఏదైనా ఒక ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఎప్పటికప్పుడు ఆర్టీఏ వెబ్సైట్ చూసి ఆన్లైన్ వేలం పాట వేసి వాహనదారునికి ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికి ఫ్యాన్సీ నెంబర్ కేటాయిస్తున్నామని ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శివలింగయ్య చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Telangana News