(K.Veeranna,News18,Medak)
పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి బ్రతకడానికి వచ్చిన నిరుపేద బిడ్డలపై కామాంధుల కళ్లు పడ్డాయి. డబ్బు ఆశ చూపించి అభం, శుభం తెలియని బాలికల్ని లోబర్చుకున్నారు. తమ కామవాంచ తీర్చుకోవడం కోసం మనుషులమనే సంగతి మరిచి మృగాల్లా ప్రవర్తించారు. సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో ఆలస్యంగా బయటపడిన కొందరు మృగాళ్ల పైశాచికత్వానికి ఏఢుగురు మైనర్ బాలికలు(Seven minor girls) గర్భం దాల్చారు. ప్రస్తుతం ఈసంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితులంతా ఒడిశాకు చెందిన వాళ్లు కావడంతో వారి తరపున న్యాయపోరాటం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.
పనికి వస్తే పాడు చేశారు..
సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం దర్గా తాండలో అత్యంత దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ శంకర్ నాయక్ ఇటుక బట్టీల వద్ద గత కొన్నాళ్లుగా ఒరిస్సా కు చెందిన 30 కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఇటుక బట్టీల దగ్గర పని చేస్తున్న కూలీల్లో మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఉన్నపళంగా బాలికలకు అనారోగ్యం రావడంతో వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే అసలు నిజం బయటపడింది. కూలీల్లో ఏఢుగురు మైనర్ బాలికలు గర్భం దాల్చినట్లుగా వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇటుక బట్టి యజమానులు మైనర్ బాలికలపై కన్నెసి వారి లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
డబ్బు ఆశ చూపించి ..
బాధితులంతా ఒరిస్సాకు చెందిన కార్మికులు. దాంతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఇక్కడ జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తెలంగాణ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రికి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కార్మిక శాఖ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజాంపేట మండలం దర్గా తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ శంకర్ నాయక్ ఇటుక బట్టీలపై అధికారులు దాడి చేశారు. ఇందుకు ప్రధాన కారణం ఇటుకబట్టి యజమాని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కావడంతోనే విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తుంది.
కామాంధులపై కఠిన చర్యలు..
మైనర్లపై అత్యా చారానికి పాల్పడింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నవనిత ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ పోలీసులు అత్యాచారం పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఏడుగురు మైనర్ బాలికలను జిల్లా అధికారులు సఖి సెంటర్ కు పంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.