(K.Veeranna,News18,Medak)
ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లక్ష్యం తారస్థాయికి చేరుకుంటోంది. ప్రజలు కట్టే పన్నులను జీతాల రూపంలో తీసుకుంటూ నిర్వహించాల్సిన బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. సంగారెడ్డి (Sangareddy)జిల్లా పటాన్‌చెరులో ఓ అంగన్‌వాడీ టీచర్ నిర్వాకం అందర్ని షాక్‌కు గురి చేసింది. పటాన్‌చెరు(Patancheru)కేంద్రంలో అంగన్‌వాడి టీచర్(Anganwadi center)తో పాటు ఆయాగా పని చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారమంగా తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. బిడ్డ ఏమయ్యాడో అనే కంగారు, ఆందోళనతో రోడ్లు, కాలనీలు, డ్రైనేజీల్లో వెదికిన పరిస్థితి ఎదురైంది. చివరకు పసివాడు అంగన్‌వాడీ కేంద్రంలోనే స్పృహ తప్పి పడిపోయినట్లుగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పసివాడు క్షేమంగా బయటపడటంతో పేరెంట్స్ దీనంతటికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు ఆయాను సస్పెండ్ చేసి అంగన్‌వాడి టీచర్‌కు షోకాజ్ నోటీసు(Show Cause Notice) జారీ చేశారు.
అంగన్‌వాడి సిబ్బంది నిర్లక్ష్యం..
అంగన్‌వాడి కేంద్రానికి వచ్చే వచ్చే పిల్లలను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారిని ఇంటికి తీసుకెళ్లి అప్ప చెప్పే బాధ్యత అంగన్‌వాడి సిబ్బందిపై ఉంటుంది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని కూడా ప్రభుత్వం నియమించింది. కానీ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంగన్‌వాడి సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంగన్‌వాడి కేంద్రంలో పసివాడు ఉన్న విషయం చూసుకోకుండా తాళం వేసి వెళ్లిపోవడంతో ఫలితంగా రెండున్నర సంవత్సరాల బాలుడు మధ్యాహ్నం నుంచి రాత్రి 9:30 గంటల వరకు అంగన్‌వాడి కేంద్రం రూమ్‌లో భయంతో ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు.
7గంటల పాటు గదిలోనే..
అంగన్‌వాడి కేంద్రానికి వెళ్లిన పసివాడు రాత్రి 9.30గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అంగన్‌వాడి కేంద్రం సమీపంలోని కాలనీలాలతో పాటు ప్రధాన రహదారులు, డ్రైనేజీలు, పాడుబడిన బావుల్లో కూడా వెదికారు. ఎక్కడ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు పటాన్చెరువు పోలీసులను ఆశ్రయించారు. అంగన్వాడి కేంద్రం నుంచి తమ కొడుకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే ఇంటికి వచ్చేవాడని రాత్రి 9:30 అయిన ఇంటికి రాలేదని వాపోయారు.
ఆందోళన చెందిన పేరెంట్స్..
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు అంగన్‌వాడీ కేంద్రం సమీపంలోని సీసీ కెమెరాలు పర్యవేక్షించగా అంగన్‌వాడి సెంటర్ నుంచి పసివాడు బయటకు రాలేదని గుర్తించారు. అక్కడకు వెళ్లి తాళం తీసి చూడగా కేంద్రంలోని ఒక మూలకు రెండున్నర సంవత్సరాల పసివాడు ఏడ్చి ఏడ్చి నీరసానికి గురై మాట రాలేని పరిస్థితిలో పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. సుమారు ఏడు గంటల పాటు అంగన్వాడి కేంద్రంలోని గదిలో ఒక్కడు ఏడ్చుకుంటూ ఉండడంతో భయపడడంతో పాటు ఏడ్వటం కారణంగా నీరసించి పడిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.
ముగ్గురిపై చర్యలు ..
ప్రభుత్వ నిబంధన ప్రకారం అంగన్‌వాడి కేంద్రానికి వచ్చే పిల్లలను మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాళ్లను ఇంటి వద్దకు పంపించి రావాల్సిన బాధ్యత ఆయాపై ఉంటుంది. కానీ ఇక్కడ అంగన్‌వాడి టీచర్, ఆయాలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి బాలుడ్ని లోపలే ఉంచి తాళం వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారిణి ఐసిడిఎస్సి పిడి పద్మమావతి బాలుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్‌వాడి సెంటర్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని న్యూస్18కి వివరించారు. ఆయాను సస్పెండ్ చేసి టీచర్, సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లుగా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, School boy, Telangana News