హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sadhguru jaggi Vasudev: ‘‘సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటే”: సద్గురు జగ్గీ వాసుదేవ్​ 

Sadhguru jaggi Vasudev: ‘‘సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం ఒక్కటే”: సద్గురు జగ్గీ వాసుదేవ్​ 

మొక్కలు నాటుతున్న వాసుదేవ్​, సంతోష్​ తదితరులు

మొక్కలు నాటుతున్న వాసుదేవ్​, సంతోష్​ తదితరులు

తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని సద్గరు జగ్గీ వాసుదేవ్ అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోందని అభిప్రాయపడ్డారు .

  తెలంగాణ (Telangana) హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ (Sadh guru jaggi Vasudev) సూచించారు . తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని ఆయన అన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోందని సద్గరు జగ్గీ వాసదేవ్ అభిప్రాయపడ్డారు . పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని.. వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర (World Tour) చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు (Bangalore) పయనం అయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను (Fifth phase) శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు.

  చిన్న వయసులో పెద్ద బాధ్యత..

  చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్ (Save Soil), గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అన్నారు.

  పూర్వజన్మ సుకృతం: ఎంపీ సంతోష్ కుమార్

  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (CM KCR) మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి ఆదరాభిమానాలు, సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన అన్నారు.

  కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణకు హరితహారం ప్రగతి నివేదికను సమావేశంలో వివరించారు. ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు విశదీకరించారు.

  సేవ్​ సాయిల్​ పోస్టర్లతో ఎంపీ సంతోష్​కుమార్​

  ఒకేసారి పదివేల పెద్ద మొక్కలు..

  గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు. సద్గురుతో పాటు, ఆయన అభిమానులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, OSD ప్రియాంక వర్ఘీస్, ప్రభుత్వ సలహాదారు ఆర్. శోభ, పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ సునీత భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్ఓ జానకిరామ్, ఎఫ్ఆర్వో విష్ణు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Green india challenge, Sadhguru Jaggi Vasudev

  ఉత్తమ కథలు