news18-telugu
Updated: August 19, 2020, 9:06 PM IST
ఎస్పీ బాలు కోసం చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు
కరోనాతో పోరాడుతున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. కోవిడ్‌ని జయించి మళ్లీ పాటలు పాడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని చిల్కూరు బాలాజీ ఆలయంలోనూ బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిల్కూరు బాలాజీకి ప్రియమైన భక్తుడని.. ఆయన కోలుకోవాలంటూ ప్రత్యేకమైన ప్రార్థన చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. స్వామి వారి సన్నిధిలో ఎస్పీ బాలు ఎన్నో పాటలు పాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

శ్రావణమాసం అమావాస్య రోజు స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేశాం. ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని భక్తితో ప్రార్థించాం. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన త్వరలోనే సొంత శ్వాస తీసుకోవాలని కోరాం. ఇవాళ ఆదిత్య హృదయ పారాయాణం, నరసింహ మంత్రంతో అర్చన చేశాం. ఆయన చిలుకూరు బాలాజీకి ఆయన ప్రియమైన భక్తుడు. స్వామి వారి సన్నిధిలో ఎన్నోసార్లు పాడారు. ఆయన త్వరగా కోలుకోవాలి.
— సీఎస్ రంగరాజన్
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నోసార్లు చిల్కూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారి సన్నిధిలో పాటలు పాడారు. అంతేకాదు చిల్కూరు బాలాజీ సినిమాలో ఆయన ప్రధాన పాత్రను పోషించారు. కాగా, కరోనాతో ఎస్పీ బాలు ఆగస్టు 5న నుంచి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సంగీత ప్రియులు కూడా ఆగస్టు 20న సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరుతున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 19, 2020, 8:39 PM IST