హోమ్ /వార్తలు /తెలంగాణ /

National Award: తెలంగాణ పల్లెకు జాతీయ అవార్డు.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఆ గ్రామం.. ఎక్కడంటే..

National Award: తెలంగాణ పల్లెకు జాతీయ అవార్డు.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఆ గ్రామం.. ఎక్కడంటే..

రుయ్యాడి గ్రామం

రుయ్యాడి గ్రామం

National Award: గ్రామస్థులంతా కలిసి ఒక్కతాటిపై నడిస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఆ గ్రామం దానంతట అదే అభివృద్ది చెందుతుంది. అలా ఆ గ్రామస్థులంతా ఒక్కమాటమీద నిలబడి తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుకుని జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...

  అక్కడ ఊరంతా ఒకే మాటపై ఉంటారు. పారిశుద్ద్యంలో ముందడుగు వేస్తారు. పక్కన ఉన్న గ్రామాలు ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. దీని ఫలితమే జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అవార్డును సొంతం చేసుకుంది. అదే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామం. సహజ వనరుల వినియోగం, పరిసరాల స్వచ్చతకు పాటుపడటంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూప్రగతికి పట్టం కడుతున్న ఈ రుయ్యాడి గ్రామం దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తికరణ్ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా నిర్వహించిన పోటిలో పారిశుధ్య విభాగంలో ఈ గ్రామం అవార్డును దక్కించుకుంది. గతంలో ఈ-పంచాయితీ పురస్కారం కూడా దక్కింది. తాజాగా మరోసారి జాతీయ అవార్డు దక్కించుకుంది. రుయ్యాడి గ్రామంలో 457 కుటుంబాలు, 1873 జనాభా ఉంది. గ్రామంలో చేపడుతున్న పనుల్లో కేంద్ర బృందం 31 అంశాలను పరిగణలోకి తీసుకుంది.

  గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకొని సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించారు. ప్రతిరోజూ రహదారులు, మురుగుకాల్వలు శుభ్రం చేయడం, చెత్త రిక్షాలతో ఇంటింటా తిరుగుతూ తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువుల తయారీ, హరితహారం మొక్కల పెంపకం,తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి కాలనీలో సిసి రోడ్డుతో పాటు జిల్లాలోనే మొట్టమొదటి సారిగా వైకుంటధామ నిర్మాణాన్ని ఇక్కడే చేపట్టి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరధ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. పంచాయితీకి సంబంధించిన లావాదేవీలు ఆన్ లైన్ లో పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

  వార్డుకు ఒకరి చొప్పున 8 మంది స్వచ్చత పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం విశేషం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్ తో పాటు పాలక మండలి సభ్యులు, అధికారులు నిరంతరం గ్రామ అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో జాతీయ స్థాయిలో పంచాయితీ సత్తా చాటిందని సర్పంచ్ పుండ్రు పోతారెడ్డి తెలిపారు. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఇతర గ్రామ ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకొని ఎన్నో అవర్డులు గెలుచుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Central Government, National Awards, Pm modi, Ruyyada, Swashakthi karan award

  ఉత్తమ కథలు