HOME »NEWS »TELANGANA »rtc fares should be increased due to diesel price hike officials request to telangana cm kcr ak

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయా ?.. కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ ?

Telangana RTC: తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయా ?.. కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ ?
ఫ్రతీకాత్మక చిత్రం

Telangana RTC: రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలని.. బస్సు చార్జీలు పెంచాలని... ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

  • Share this:
    భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వారు విన్నవించారు. క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేదని... కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్‌కు 15 రూపాయలు పెరిగింది అధికారులు సీఎంకు వివరించారు. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసిందని... ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉందని... ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదని తెలిపారు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదని ముఖ్యమంత్రికి వివరించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలని.. బస్సు చార్జీలు పెంచాలని... ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

    గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైందని... ప్రభుత్వం అందించిన సాయం.. ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని అధికారులు తెలపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చిందని... ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుందని అన్నారు. క్రమంగా ఇది పెరుగుతున్నదని... దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నదని ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందని... అయితే డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నదని అన్నారు. లాక్ డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయని వివరించారు.



    ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సిఎం చెప్పారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని సిఎం అభినందించారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని సిఎం అన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సిఎం పిలుపునిచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published:January 21, 2021, 20:41 IST