కరోనా వైద్యం పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడుతోంది..దీంతో రాష్ట్ర అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించారు..చికిత్స పేరుతో లక్షల రూపాయలను వసూలు చేయడంతో పాటు కొన్ని ఆసుపత్రులు నిర్లక్ష్యం వహించడంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన ఊపిరితో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రోగి బంధువులకు డబ్బులు ఖర్చు కావడంతోపాటు ప్రాణాలు కూడా నిలవడం లేదు..
ఇలాంటీ పరిణామాలతోనే రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందిస్తుంది.అధిక డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రుల నుండి డబ్బులు వసూలు ఇవ్వాలని అధికారులకు సూచించింది. దీంతో అధిక ఫీజులపై అధికారులు, ఇటు ప్రజా ప్రజాప్రతినిధులు సైతం దృష్టి సారించారు..ఈ క్రమంలోనే మంత్రి కేటిఆర్‌కు ఓ భాదితుడు ట్విట్టర్ ద్వార డబ్బుల వసూలు పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన ఆసుపత్రి వద్ద తిరిగి బాధితుడికి అధిక వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించాడు.
వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాంపేటకు చెందిన చిలుకూరి రవీందర్ రెడ్డికి కరోనా సోకడంతో గత నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాడు. అయితే చికిత్స నేపథ్యంలోనే మొత్తం ఏడు లక్షల రూపాయలు బిల్లు వేశారు. అయితే అంత బిల్లు వేసినా.. రోగి పరిస్థితి మాత్రం విషమంగానే తయారయింది..దీంతో చేతులెత్తేసిన వైద్యులు రవీందర్‌ను ఈ నెల 30న గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం సీరియస్ కావడంతో గాంధీలో చేరిన మరునాడే ఆయన మృతి చెందాడు..
అయితే పదిహేను రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు చివరకు చేతులెత్తేయడం, దీనికి తోడు బిల్లును అదనంగా వేయడంతో మృతుడి బంధువులు స్థానిక చౌటుప్పల్ ఎంపీపీ అయిన తాడూరి వెంకట్ రెడ్డిని సంప్రదించారు..దీంతో ఆయన నేరుగా మంత్రి కేటిర్ దృష్టికి అధిక బిల్లు విషయమై మెయిల్ ద్వార తీసుకువెళ్లారు.దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటిఆర్ బాధితులకు న్యాయం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయిన గువ్వల బాలరాజును ఆదేశించారు.
దీంతో ఆయన నేరుగా వెళ్లి ఆసుపత్రి యాజమాన్యంతో వైద్య ఖర్చులపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల పరంగా వైద్యానికి అయిన ఖర్చును మినాహాయించుకుని తిరిగి అదనంగా తీసుకున్న డబ్బులను ఇవ్వాలని నిర్ణయించారు..దీంతో ఆసుపత్రి యాజమాన్యం దిగివచ్చింది. రవీందర్ కుటుంబసభ్యులు కట్టిన మొత్తం ఏడు లక్షల్లో నాలుగు లక్షలను తిరిగి రవీందర్ రెడ్డి సోదరుడు రంగారెడ్డి ఖాతాలో వేసింది. దీంతో మంత్రి కేటిఆర్ చొరవపై రవీందర్ రెడ్డి కుటంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటీ డబ్బులు వాపసు కార్యక్రమాలతో పాటు అసలు అధికంగా వసూలు చేయకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.