మెదక్‌లో భారీ దోపిడీ.. లారీ నుంచి రూ.2 కోట్ల రెడ్‌మీ ఫోన్లు చోరీ..

కంటైనర్‌లో సెల్‌ఫోన్లు ఉన్నాయని తెలుసుకున్న దొంగలు.. అదునుచూసి వాటిని కాజేశారు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయన్న విషయం తెలియక డ్రైవర్‌ అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీకి బయలుదేరాడు.

news18-telugu
Updated: September 23, 2020, 1:33 PM IST
మెదక్‌లో భారీ దోపిడీ.. లారీ నుంచి రూ.2 కోట్ల రెడ్‌మీ ఫోన్లు చోరీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ లారీ నుంచి రూ.కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కొట్టేశారు దొంగలు. పక్కా ప్లాన్‌తో.. హైవేపై మాటువేసి.. దోపిడీకి పాల్పడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అదును చూసి అపహరించారు. మొత్తం 2200 సెల్‌ఫోన్లు అపహరణకు గురైనట్లు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 15న చెన్నై నుంచి ఢిల్లీకి రెడ్‌మీ కంపెనీకి చెందిన రూ.11 కోట్ల విలువైన సెల్‌ఫోన్లతో కంటైనర్‌ బయలుదేరింది. కంటైనర్‌ డ్రైవర్‌ దేవేందర్‌ 16న రాత్రి 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆపాడు. ఐతే కంటైనర్‌లో సెల్‌ఫోన్లు ఉన్నాయని తెలుసుకున్న దొంగలు.. అదునుచూసి వాటిని కాజేశారు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయన్న విషయం తెలియక డ్రైవర్‌ అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీకి బయలుదేరాడు.

అలా మెదక్ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా వరకు వెళ్లాడు. ఇచ్చోడ వద్దకు వెళ్లిన తర్వాత డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. లారీని ఆపి చూడగా.. కంటైనర్ తాళాలు తీసి ఉన్నాయి. డోర్ తీసి చూస్తే లోపల మొబైల్ ఫోన్లు కనిపించలేదు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ దేవేందర్.. కంపెనీ ప్రతినిధులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశాడు. ఢిల్లీ నుంచి ఆదిలాబాద్ చేరుకున్న ప్రతినిధులు.. 2200 సెల్‌ఫోన్లు చోరీ అయినట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. జీపీఎస్‌ ఆధారంగా మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు కంటైన్ ఆగినట్లు చెప్పారు. మాసాయిపేట వద్ద చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత మంగళవారం చేగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంటైనర్‌ హరియాణాకు చెందినది కాగా.. డ్రైవర్‌ యూపీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు.
Published by: Shiva Kumar Addula
First published: September 23, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading